Aug 28,2023 21:31

చెరువు గట్టుకు గండి, చేపలు పట్టి నిరసన
వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆధ్వర్యంలో కదంతొక్కిన పేదలు
మద్దతుగా కదిలొచ్చిన సిఐటియు, రైతుసంఘాల నేతలు
చెరువు వద్దే వంటావార్పు
మా భూములు మాకివ్వాలంటూ నినాదాల హోరు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, అర్భన్‌
ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం దోసపాడు భూపోరాటం ఉధృతమైంది. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆధ్వర్యంలో భూబాధితులు సోమవారం కదంతొక్కారు. చేపల చెరువులో చేపలు పట్టి, గట్టుకు గండికొట్టి నిరసన తెలిపారు. దీనికి సిఐటియు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలుపుతూ కదిలిరావడంతో భూపోరు తారాస్థాయికి చేరింది. దోసపాడు గ్రామంలో దళితులకు సంబంధించి వందెకరాలకుపైగా అసైన్డ్‌ భూములను బడాబాబులు ఆక్రమించి ఆ భూముల్లో చేపల చెరువులు తవ్వి 20 ఏళ్లకుపైగా అనుభవిస్తున్నారు. చట్టప్రకారం అసైన్డ్‌ భూముల అమ్మకం, కొనుగోళ్లు చెల్లవు. అప్పట్లో తమ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తమ భూములు కాజేశారని బాధితులు వాపోతున్నారు. సెంటుభూమి కూడా లేకుండా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'మా భూములు మాకివ్వండి' అంటూ తహశీల్దార్‌, ఆర్‌డిఒ, జిల్లా కలెక్టర్‌, ఎంఎల్‌ఎ వరకూ సమస్యను తీసుకెళ్లారు. పోరాటంలో పాల్గొంటున్న దళితులను పోలీసులతో బెదిరించి, కేసులు పెట్టి దారికి తెచ్చుకోవాలని పెత్తందారులు చూశారు. బాధితులు ఏమాత్రం తగ్గకపోవడంతో సమస్యను పరిష్కరిస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనేకసార్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. దీంతో ఓపిక నశించిన బాధితులు చెరువులకు గండికొట్టాలని నిర్ణయించుకున్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుం బిగించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్‌.మహంకాళిరావు, సిహెచ్‌.మాధవ, అందుగుల ప్రభాకర్‌రావు, పెద్దఎత్తున బాధిత రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వలలు వేసి చేపలు పట్టి, గట్టుకు గండికొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకూ శాంతియుతంగా పోరాటం చేశామని, ఇక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు గండ్లు కొట్టడం జరిగిందన్నారు. దోసపాడు దళితులకు వెంటనే వారి భూములు అప్పగించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అఖిల భారత స్థాయికి సమస్యను తీసుకువెళ్తామన్నారు. అసైన్డ్‌ చట్టంలో మార్పులు చేసి పేదల భూములను జగన్‌ భూస్వాములకు కట్టబెట్టాలని చూడటం దారుణమన్నారు. ఇప్పటికైనా జగన్‌ పేదల పక్షమో.. భూస్వాముల పక్షమో తేల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.