Apr 20,2023 22:40

మూడో రోజు చేపలు పట్టి నిరసన తెలిపిన దళితులు, పేదలు
అధికారులు నిర్లక్ష్యం వీడాలి: ఎపి వ్యకాస నేత పి.రామకృష్ణ
ప్రజాశక్తి - దెందులూరు

దోసపాడు దళితుల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. తమకు చెందిన అసైన్డ్‌, సీలింగ్‌, గయాళ భూముల కోసం పేదలు గత 10 నెలల నుండి పోరాడుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ దళితులు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం చేపల చెరువులో దిగి చేపలు పట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భూములు పంచాలని గత 10 నెలల నుంచి పోరాడుతున్నా రెవెన్యూ అధికారులలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం కుమ్మక్కై పేదలకు, దళితులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భూపోరాట నాయకులు ఆనందరావు, బేబీ, కుమారి, గంగాధర్‌, దివాకర్‌, పవన్‌, వెంకటరమణ, తేరేజమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.