Oct 31,2023 23:15

తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్ద దోర్నాలను కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దారు కార్యాలయం వద్ద రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం పెద్దదోర్నాల మండల కార్యదర్శి దుర్గంపూడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దోర్నాల మండలం, మార్కాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో తీవ్ర కరువు ఛాయలు నెలకొన్నట్లు తెలిపారు. వర్షాలు ముఖం చాటేయడంతో బోరు బావులు ఎండిపోయాయన్నారు. చెరువులు, కుంటలల్లోనూ చుక్క నీరు లేదన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంటలు ఎండి పోవటంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. అప్పులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువు గురించి మాట మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే పెద్ద దోర్నాలను కరువు మండలంగా ప్రకటించాలన్నారు. ఎండిపోయిన మిర్చి పంటకు ఎకరానికి లక్ష రూపాయలు, పత్తి, పొగాకు పంటకు రూ.50 వేల రూపాయలు, కంది, మినుము పంటలకు రూ. 25 వేల వంతున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వర్ష భావం వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. దీంతో వారు వలస బాట పట్టారన్నారు. ఉపాధి హామీ పనులు ప్రారంభించి రోజు కూలీ రూ. 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కుంటలు చెరువులు, వాగులు ఎండిపోవడం వల్ల కనీసం తాగునీరు కూడా లేక పశువులకు అల్లాడుతున్నాయని తెలిపారు.పశుగ్రాసం సరఫరా చేయాలన్నారు. గ్రామాలలో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి పశువుల దాహార్తి తీర్చాలని డిమాండ్‌ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి పది టిఎంసిల నీరును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం దోర్నాల మండల నాయకులు వెన్న మల్లారెడ్డి, రైతులు బొడ్డుపల్లి పిచ్చయ్య, ఏలూరు వెంకటేశ్వర్లు, ఏలూరి నాగురయ్య, దర్శనం వెంకటేష,్‌ వినుకొండ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.