డోన్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
- ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల
డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం, బేతంచెర్ల పట్టణంలలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు నిర్వహించారు. ముందుగా రంగాపురంలో మద్దిలేటి స్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రూ.2.75 కోట్లతో ఆర్.ఎస్ రంగాపురంలో నిర్మించనున్న రాతి కట్టడానికి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. బేతంచెర్ల డ్రైవర్స్ కాలనీలో రూ.80 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను, గౌరీపేటలో రూ.29 లక్షలతో కొత్తగా నిర్మించిన ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బుగ్గన మాట్లాడారు. వేల కోట్ల రూపాయలతో విద్య, వైద్యం ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు అనవసరమైన నిందలు వేయడం సరికాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. విమర్శించే నాయకులకు భవిష్యత్తులో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపిపి బుగ్గన నాగభూషణం రెడ్డిలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో బేతంచెర్ల మండలాన్ని ఏ ఒక్క విషయంలోనూ అభివృద్ధి చేయలేదని అన్నారు. మంత్రి బుగ్గన 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బేతంచెర్ల పట్టణాన్ని విద్య, వైద్యం అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. కార్యక్రమంలో డీఈవో సుధాకర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధికారి పర్వీన్, నగర పంచాయతీ చైర్మన్ చలంరెడ్డి, బాబుల్ రెడ్డి, మూర్తి జావలి, ఖాజా హుస్సేన్, మద్దిలేటి స్వామి చైర్మన్ సీతా రామ చంద్రుడు, ఈవో పాండురంగారెడ్డి, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, రంగాపురం సర్పంచ్ రాజు, గోరుమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో అధ్యక్షులు నారాయణ, బలరామిరెడ్డి, ముస్లిం మత పెద్ద నూరుల్లా ఖాద్రి, సాదిక్ హుస్సేన్, దస్తగిరి ఎద్దులన్న, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రికి గజమాలతో సన్మానం
ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు, బేతంచెర్ల మైనారిటీ సోదర, సోదరీమణులతో మంత్రి బుగ్గన సమావేశం అయ్యారు. అనంతరం చిన్నారుల భవిష్యత్ కోసం త్వరితగతిన ఉర్దూ పాఠశాలను నిర్మించిన సందర్భంగా మంత్రిని ముస్లిం నాయకులు గజమాలతో సన్మానించారు.










