Nov 03,2023 19:39

గుంపులుగా ఉన్న కుక్కలు

డోన్‌ కొండపేటలో కుక్కల బెడడ
- మందలుగా వస్తున్న శునకాలు
- వారంలో ముగ్గురిపై దాడి - రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయం
- మున్సిపల్‌ అధికారులు స్పందించాలంటున్న స్థానికులు
ప్రజాశక్తి-డోన్‌

    డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండపేట డిపో సందు కాలనీ మీసేవ లైన్‌లో కుక్కలు మందలు మందలుగా తిరుగుతున్నాయి. ఒక్కోసారి 20 నుంచి 30 కుక్కలు గుంపుగా వస్తున్నాయి. గత వారంలో ముగ్గురిపై కుక్కలు దాడి చేసి కరిచాయి. అందులో రెండేళ్ల బాలుడు దినకర్‌ చేతిని కరవడంతో చేతి ఎముక విరిగి తీవ్రగాయమైంది. పరిస్థితి విషమించి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పపత్రికి తరలించారు. దాదాపు రూ. రెండు లక్షలు ఖర్చు చేశాక కూడా పూర్తిస్థాయిలో బాలుడు కోలుకోలేదు. బాలుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడదతో పిల్లలు, వృద్ధులు బయట తిరగడానికి భయపడుతున్నారు. కొండపేట డిపో సందులో ఒక మహిళ అద్దెకు ఉంటున్నారు. ఆమె రెండు కుక్కలను పెంచుకున్నారు. ఆ కుక్కలతో ప్రతిరోజు వీధిలో తిరుగుతారు. ఆ కుక్కల కోసం ఇతర కుక్కలు కూడా వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్‌ అధికారులు చొరవ తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.
కమిషనర్‌ , ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్తాం
ఇన్‌ఛార్జిశానిటరీ ఇన్‌స్పెక్టర్‌-సునీల్‌బాబు
కొండపేట కాశీంవలి డిపో సందు కాలనీలో మీసేవ లైన్‌లో కుక్కల బెడదపై మున్సిపల్‌ కమిషనర్‌, ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. కుక్కలకు ఆంటిబైట్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌(ఎబిసి ఆపరేషన్‌) చేసి వాటిని నిబంధనల ప్రకారం యధాస్థానంలో వదిలిపెట్టాలి. అయితే ఎబిసి సెంటర్‌ డోన్‌లో లేదు కాబట్టి నంద్యాలకు తరలించి చేయించాలి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నదే. మున్సిపల్‌ ఛైర్మన్‌, కమిషనర్‌కు నివేదిస్తాం. వారి నిర్ణయం ప్రకారం చేస్తాం.

ప్రజలకు ఇబ్బంది కలిగించే కుక్కల సమస్యలను పరిష్కరిస్తాం
మున్సిపల్‌ ఛైర్మన్‌ సప్తశైల రాజేష్‌
కొండపేటతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు ఎక్కడ ఇబ్బంది కలిగించినా ఆ సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీ తరపున తక్షణ చర్యలు తీసకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ సమస్య పరిష్కారానికైనా మా వంతు కృషి చేస్తాం. కొండపేట కాశీంవలి డిపో సందులో కుక్కల బెడద లేకుండా చూస్తాం.