ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి జి.రవీంద్ర రత్నాకర్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా వ్యాధులతో పాటు వైరల్ ఫీవర్లకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
డెంగీ, మలేరియా, చికున్ గున్యా నివారణకు ఏం చర్యలు చేపట్టారు?
వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వారంలో ఒక రోజు అంటే ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకున్నాం. డెంగీ జ్వరం అనేది ఈడిస్ ఈజిప్టు అనే దోమ ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. దోమ కాటు వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలు తదితర వ్యాధులు ప్రభలకుండా ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు,హెల్త్ సూపర్ వైజర్లు ఫ్రై డే డ్రైడే కార్యక్రమం పేరుతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
దోమల నివారణకు ప్రజల సహకారం అవసరం. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎయిర్ కూలర్‌లలో నీరు, నీటి తొట్టెల్లో నీటిని వారం రోజులకు ఒకసారి మార్చుకోవాలి. దీంతోపాటు ఇంటి పరిసరాల్లో తాగి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లును లేకుండా చూసుకోవాలి. మురుగు కాల్వల్లో చెత్త చెదారం వేయకుండా, ఇంట్లోని పనికిరాని వస్తువులను తొలగించుకోవాలి. ఈ చర్యల ద్వారా దోమలను కొంతమేరకు నివారించొచ్చు.
వ్యాధుల లక్షణాలు ఏమిటి? నిర్థారణ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు?
డెంగీ, మలేరియా జ్వరం లక్షణాలు రోగి వయసుపై ఆధార పడి ఉంటాయి. అధిక జ్వరం, కండరాలు, కీళ్ల నొప్పులు, నీరసం, తలనొప్పి, అలసట, ఆకలి మందగించడం, కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు ఆయా వ్యాధులు సోకిన వారిలో ఉంటాయి. సాధారణ జ్వరాల బారిన పడిన వారికి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీకి మాత్రం 'ఎలీసా' పరీక్షల ద్వారా మాత్రమే నిర్థారించి అనంతరం చికిత్స అందిస్తారు. ఈ 'ఎలీసా' పరీక్షలు నరసరావుపేట పట్టణ సమీపంలో లింగంగుంట్లలో గల డాక్టర్ వైఎస్‌ఆర్ జిల్లా హాస్పిటల్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఉచితంగానే చేస్తారు.
ఇప్పటి వరకు ఎన్ని రక్త నమూనాలు సేకరించారు?
వైరల్ జ్వరాలు సోకిన నుండి ఇప్పటి వరకు 133503 మంది వద్ద నుండి నమూనాలు సేకరించాం. వీటిలో 553 డెంగీ అనుమానిత కేసులకు పరీక్షలు చేయగా 66 డెంగీ కేసులు, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి.
వ్యాధి నిర్థారణ అయిన ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారా?
కేసులు నిర్థారనైన ప్రాంతాల్లో సిబ్బంది పర్యటించి బాధితుల కుటుంబ సభ్యుల నుండి కూడా రక్త నమూనాలు సేకరించడం, పరీక్షలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాం. ఆయా ప్రాంతాల వివరాలను గ్రామీణ ప్రాంతాల్లో అయితే జిల్లా పంచాయితీ అధికారులకు, పట్టణ పరిధిలో అయితే మున్సిపల్ కమిషనర్‌కు అందజేస్తాం. వారి పర్యవేక్షణలో ఫాగింగ్, మురుగు కాల్వలలో పూడికతీత, పరిసరాలను శుభ్రం చేస్తారు.
పల్నాడు జిల్లాలో దోమతెరలు పంపిణీ చేశారా ?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2019లో ప్రభుత్వ పరంగా వచ్చిన 60 వేల దోమతెరలను మొత్తం పల్నాడు జిల్లాలో పంపిణీ చేశాం. హై రిస్క్ కలిగిన ప్రాంతాలపై దోమల నివారణకు దోమతెరలు పంపిణీ చేశాం. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో మురుగునీరు ఎక్కువ నిల్వ ఉంటుందో వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు దోమల లార్వాలను నాశనం చేసేందుకు చర్యలు చేపట్టాం. మాచర్ల, కారంపూడి, బొల్లాపల్లి తదితర మండలాల్లోని గిరిజన, చెంచు కాలనీలో, దళితవాడలలో పంపిణీ చేశాం. ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 75 వేల దోమతెరలు అవసరమని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. గతంలో పంపిణీ చేసిన 60 వేల పాత దోమతెరలను వెనక్కు తీసుకొని తిరిగి మళ్లీ వారికి కొత్తవి ఇస్తాం. పేదల వాడల్లో ఉండే ప్రజలకు, జిల్లాలోని 137 ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నాం.
ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?
ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ లేకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. పొరపాటున ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నిలువ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వాటిని తొలగించి దోమల లార్వాలను నాశనం చేస్తున్నాం. కేసులు నమోదయ్యాయని గుర్తిస్తే డెంగీ మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యటించి వ్యాధిగ్రస్తుల నుండి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి రక్తనాళాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ఉదయం సాయంత్రం సమయాల్లో చలి ప్రదేశాలలో తిరగకూడదు. అదే సమయంలో ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు చైతన్య పరిచి దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది తెలియజేస్తున్నాం.
జ్వరాలతో ఎవరైనా మరణించారా?
పల్నాడు జిల్లా ఏర్పడ్డాక డెంగీ, చికున్ గున్యా, మలేరియా వ్యాధులు భారిన పడిన వారు చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. మరణాలేమీ సంభవించలేదు. వ్యాధుల బారిన పడిన వారికి ప్రభుత్వ ఏరియా, విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో ఉచితంగా చేస్తున్న పరీక్షలు చికిత్సలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించడంతోపాటు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, మందులు పిచికారీ కార్యక్రమంలో చర్యలు తీసుకున్నాం. ఆయా వైద్య బృందాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇచ్చే సూచనలు?
డెంగీ, మలేరియా,ఫైలేరియా, టైఫాయిడ్, మెదడు వాపు వ్యాధులు దోమ కాటు వల్ల వ్యాపిస్తాయి. వీటితో పాటు కొత్తగా 'జికా' అని పిలువబడే కొత్త వైరస్ ఉత్తరప్రదేశ్, ఓడిశా తదితర రాష్ట్రంలలో విజంభించింది. ప్రజలు చిన్నారులు దోమకాటుకు గురి కాకుండా విధిగా దోమ తెరలు వినియోగించడం ద్వారా 95 శాతం వరకు ఆయా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొద్ది వారాలుగా చికున్ గున్యా, డెంగీ, మలేరియా జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆయా వ్యాధులు ప్రాణాతకం కకపోయినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల సూచన మేరకు చికిత్స పొందడం శ్రేయస్కరం.










