May 17,2023 00:38
బాపట్లలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-పంగులూరు: దోమల వల్ల చికున్‌ గున్యా, డెంగీ, మలేరియా, మెదడువాపు, బోదకాలు వంటి అనేక రకాల వ్యాధులు వస్తాయని, దోమలను నివారించడం వల్ల ఈ రోగాలకు దూరంగా ఉండవచ్చునని పంగులూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్‌ రావి మల్లికార్జునరావు అన్నారు. జాతీయ డెంగీ డే సందర్భంగా, మండల కేంద్రమైన రామకూరు గ్రామంలో డాక్టర్‌ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ శివ చెన్నయ్య ఆధ్వర్యంలో డెంగీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మల్లికార్జున రావు మాట్లాడుతూ ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవా లని, వారానికి ఒకసారి డ్రైడే పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడాలని, దోమ లు కుట్టకుండా చూసుకోవాలని అన్నారు. రోగాలు వచ్చిన తరువాత బాధపడకుండా, అవి రాకముందే జాగ్రత్త పడాలని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలని కోరారు. బై డెంగీ, బై బై డెంగీ, డెంగీని పారద్రోలుదామనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయుర్వేద డాక్టర్‌ కృష్ణ కుమార్‌, సిహెచ్‌ఓ భారతి, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనురాధ, సూపర్‌వైజర్లు వెంకాయమ్మ, మదర్సా, హరిబాబు, ఎల్‌టి చందన, ఎంఎల్‌ హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం భట్టిప్రోలు, వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు శ్రీనివాసరావు, రామలక్ష్మి ఈ ర్యాలీలో పాల్గొని డెంగీ నివారణకు తీసుకోవలసిన చర్యలపై వివరించారు. దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమ తెరలు వినియోగించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమల నివారణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ మాతయ్య, మందా ప్రసాద్‌, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
అద్దంకి: జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పట్నంలోని బస్టాండ్‌ నుండి భవాని సెంటర్‌ వరకు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వరకు ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య సిబ్బంది మరియు మోదేపల్లి ఆరోగ్య సిబ్బంది డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు ఎన్‌ జయచంద్రరావు హాజరై మాట్లాడుతూ సమర్థవంతమైన సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను తొలగించాలన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలన్నారు. మరుగుదొడ్లు గ్యాస్‌ పైపులకు జాలి కట్టాలన్నారు. ఎయిర్‌ కండిషనర్లు, టైర్లు, కూలర్లు, పూల కుండీలలో నీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గొట్టిపాటి జయసింహ, ఎం అనిల్‌ కుమార్‌, ఆరోగ్య విస్తరణాధికారి నీలం రామకోటేశ్వరరావు, సిహెచ్‌ఓ వై జయశ్రీ, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు పి నాగమోహన్‌, మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు పాల్గొన్నారు.
బాపట్ల: డెంగీ నివారణకు దోమలను సమూలంగా తరిమికొట్టాలని జిల్లా మలేరియా అధికారి వై రాజకుమార్‌ అన్నారు. మంగళవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం పురస్కరించుకొని బాపట్ల జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. దోమలను నివారిద్దాం. డెంగీ వ్యాధి నుంచి ప్రజలను కాపాడదాం అని నినాదాలు చేశారు. బాపట్ల సుశీల నర్సింగ్‌ హౌమ్‌ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.