ప్రజాశక్తి -పాడేరు:మలేరియా నియంత్రణకు మొదటి విడత దోమలమందు (ఎసిఎమ్- 5శాతం) స్ప్రేయింగ్ ప్రతి ఇంట్లో ఫక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం పాడేరు మండలం కే.కుమ్మరిపుట్టు వీధిలో మలేరియా నియంత్రణ స్ప్రేయింగ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 59 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఫరిధిలోని సుమారు 79 వేల ఇళ్ళల్లో స్ప్రేయింగ్ జరుగుతోందని, ప్రతి మండలంలో రెండు స్ప్రేయర్లు, నాలుగు బృందాలతో 45 రోజులలో పూర్తి చేయాలన్నారు.స్థానిక సర్పంచ్, వాలంటీర్, ఆశ కార్యకర్తల సహకారం తీసుకొని శత శాతం స్ప్రేయింగ్ నిర్వహించాలని సూచించారు.మలేరియా నియంత్రణ పట్ల ప్రజలలో విస్తత ప్రచారం చేయాలన్నారు. స్ప్రేయింగ్‌కు ముందు రోజు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తెలిపారు. హెల్త్‌సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేయాలని, గ్రామాల వారీగా సూక్ష్మ ప్రణాళిక రూపొందించి వైద్యాధికారి ఆద్వర్యంలో పారా మెడికల్ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్, డిఎంహెచ్‌ఓ జమాల్ బాషా, టిబి నియంత్రణాదికారి విశ్వేశ్వర నాయుడు, జిల్లా మలేరియా నియంత్రణాదికారి సాంబ మూర్తి, సబ్ యూనిట్ అధికారి ధనుంజయ, మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










