ప్రజాశక్తి - సాలూరు : దోమల నివారణపై పట్టణ ప్రజలు అవగాహన పెంచుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎం.ఈశ్వరరావు కోరారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో మున్సిపల్ శానిటేషన్ అధికారి కెవి ఫకీర్‌రాజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఈశ్వరరావు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా అనేది ఆడఅనాఫిలస్ దోమ కాటు వల్ల వస్తుందని 1897 ఆగష్టు 20న సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారని చెప్పారు. ఆ రోజు ఏటా మలేరియా దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. మలేరియా కారక దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కొబ్బరి బొండాలు, టైర్లలో వృద్ధి చెందుతాయని చెప్పారు. ఇళ్లల్లో ఫ్రిజ్లో కూడా వెనుక భాగంలో ఉన్న నీటిలో దోమల ఉత్పత్తి జరుగుతుందన్నారు. వీటి నివారణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్వో రమేష్,ఆర్ ఐ అహ్మద్ పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలోని ధోనుబాయి, కుసిమి, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా సబ్ యూనిట్ అధికారి జె.మోహన్‌రావు ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ద్వారా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దోమలు కనిపెట్టిన రాబర్ట్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దోమలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరఘట్టం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్య అధికారులు జి.ప్రదీప్ కుమార్, ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దోమల వల్ల ప్రజల అవగాహన పెంపొందించుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










