ప్రజాశక్తి - భీమడోలు
గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాగింగ్ మిషన్ సేవలకు అదనంగా, దోమల సంతతి వృద్ధి చెందకుండా, ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్.ఠాగూర్, గ్రామ సర్పంచి పి.సునీత మాన్సింగ్ తెలిపారు. గ్రామ పరిధిలోని మూడు మేజర్ మురుగు కాలవల్లో దోమల వృద్ధిని అరికట్టేందుకు గంబుషియా చేపల సేవలు వినియోగించుకొంటున్నట్లు వారు తెలిపారు. మత్స్యశాఖ సౌజన్యంతో గుండుగొలను పిహెచ్‌సి పరిధిలోని భీమడోలు హెల్త్ క్లినిక్‌కు చెందిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వై.నాగదుర్గ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గంబుషియా చేపలను శనివారం తెచ్చారన్నారు. వీటిని గ్రామ పరిధిలోని మూడు మేజర్ మురుగు కాలువలలో శనివారం వేసామన్నారు. ఈ చేపలకు సహజంగానే పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ, త్వరితగతిన తమ సంఖ్యను పెంచుకుంటాయని, ఇవి మురుగు కాలువలలో పెరుగుతున్న దోమల లార్వాలను తినడం వల్ల దోమల సంఖ్య పెరగదన్నారు. ఇప్పటికే పంచాయతీ దోమల నివారణకు చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యల వల్ల మిగిలిన దోమలు చనిపోయే అవకాశాలు ఎక్కువున్నాయన్నారు. శనివారం గ్రామపంచాయతీ, ఆరోగ్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలోని మూడు మేజర్ మురుగు కాలువలలో దోమల లార్వాలను తిని వేసేందుకు 4,000 గంబుషియా చేపలను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమాల వలన గ్రామ పరిధిలో దోమల ఉధృతి తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భీమడోలు హెల్త్ క్లినిక్ సిబ్బంది మురళి, శ్రీనివాస్, చంద్రకళ ఇతర సిబ్బంది పాల్గొని సహకరించారని వారు తెలిపారు.










