May 13,2023 00:00

దోమల నివారణ మందు పిచికారి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యాధికారి హిమబిందు

ప్రజాశక్తి-సీలేరు
జీకే వీధి మండలం దారకొండ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం పరిధిలో మలేరియా నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాధుపాకల గ్రామంలో దోమల నివారణకు మందు పిచికారి చేశారు. దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు దోమల మందు పిచికారి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో బుధవారం నుంచి దోమల మందు పిచికారి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం గృహం లోపల, బయట దోమల మందును పిచికారి చేయించుకోవాలని సూచించారు. రంగు, వాసన ఉంటుందని గృహం లోపల దోమల మందు పిచికారికి కొందరు నిరాకరిస్తున్నారని, అరి సరికాదని హితవుపలికారు. ప్రస్తుతం పిచికారి చేస్తున్న ఏసీఎం 5 శాతం మందు వాసన, రంగు ఉండదన్నారు. కేవలం దోమలపైనే ప్రభావం చూపుతుందని తెలిపారు. గిరిజనులు రాత్రి సమయంలో విధిగా దోమతెరలను ఉపయోగించుకోవాలన్నారు. దోమకాటుకి దూరంగా ఉంటే మలేరియా వ్యాధి నివారించుకోవచ్చని చెప్పారు. గ్రామాల్లో గిరిజనులు జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మలేరియా నిర్ధారణ అయితే క్రమంగా మందులు వాడాలని కోరారు.