May 02,2023 23:51

హృద్రోగిని డోలిలో ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబీకులు

ప్రజాశక్తి -అనంతగిరి : మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. డోలిమోతతో ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఈలోగా అంతా సవ్యంగా సాగితే సరేసరి, లేకుంటే వారి ప్రాణాలు గాల్లోదీపమయ్యే పరిస్థితులు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా మంగళవారం అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ మారుమూల గ్రామమైన కర్రిగోడ గ్రామానికి చెందిన సింబోయిన. శాంతి అనే పందొమ్మిదేళ్ల యువతికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో కర్రిగోడ నుంచి కొండ మార్గంలో దాదాపు పది. కిలోమీటర్లు దూరాన ఉన్న గుమ్మ వరకు యువతి కుటుంబసభ్యులు డోలిలో మోసుకొచ్చి, అక్కడ నుంచి అంబులెన్స్‌ ద్వారా విజయనగరం జిల్లా ఎస్‌ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యసేవలతో యువతిశాంతి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. కర్రిగుడ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో పనులు జరగకపోవడంతో ఇలా అనునిత్యంతోపాటు అత్యవసర పరిస్థితుల్లోనూ నానా ఇబ్బందులు పడుతున్నామని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి అటవీశాఖను బాధ్యులుగా చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.