
* రౌండ్‌టేబుల్ సమావేశంలో టిడిపి నాయకుల ధ్వజం
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: చంద్రబాబు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే... సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆ కాళ్లు విరిచి కట్టు కట్టాడని అఖిల పక్ష నాయకులు విమర్శించారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రూ.75 వేల కోట్ల బిసి సబ్ ప్లాన్ విధులను దారి మళ్లించిన బిసిల ద్రోహి జగన్ అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌టిఆర్, చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే... జగన్ 24 శాతానికి కుదించి 16,800 మందికి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేశారని విమర్శించారు. చంద్రబాబు బిసిలకు భూములు కొనుగోలు చేసి అందిస్తే జగన్ బిసిల నుంచి 8 వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని ఎద్దేవా చేశారు. వైసిపి పాలనలో 74 మంది బిసిల హత్య, 800 మందిపై తప్పుడు కేసులు, మూడు వేల మందిపై దాడులకు పాల్పడ్డారరని అన్నారు. 13 బిసి భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్లు నిర్మాణాలు నిలిపివేశారన్నారు. 1998లో టిడిపి హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెడితే వాటి రద్దు కోసం సుప్రీం కోర్టుకు వెళ్లడం శోచనీయమన్నారు. మెరుగైన ఉద్యోగాల కల్పన లక్ష్యంగా విద్యోన్నతికి శిక్షణ ఇస్తే... జగన్ దానిని రద్దు చేశారని గుర్తు చేశారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ రద్దు చేసి ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లికానుక, అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు రద్దు చేశారని అన్నారు. ఇళ్ల పట్టాలు, ఒటిఎస్ పేరుతో పేదలను దోచుకున్నారన్నారు. టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాతనే బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు వచ్చాయన్నారు. చంద్రబాబు హయాంలో బడుగు, బలహీవర్గాల ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పారిశ్రామిక రాయితీలిచ్చి పారిశ్రామిక వేత్తలను చేశారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టులన్నీ సొంత వర్గానికి కట్టబెట్టి బడుగులను అణగదొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని జెపి వెంచర్స్కు కట్టబెట్టారని, మద్యం కాంట్రాక్టర్లను విజయసాయిరెడ్డి బంధువులకు అప్పగించారని అన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, ఐగ్గు రమణమూర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, సింతు సుధాకర్, బిసి సెల్ అధ్యక్షులు కలగ జగదీష్, ప్రధాన కార్యదర్శి, గోవింద పాపారావు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పిరుకట్ల విఠల్, రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, మాదారపు వెంకటేష్, బోయిన గోవిందరాజులు, దామోదర నరసింహులు, గురుమూర్తి, పూరి కోటేశ్వరరావు, తమ్మిన విజయకుమార్ పాల్గొన్నారు.