* చంద్రబాబుపై స్పీకర్ సీతారాం ధ్వజం
ప్రజాశక్తి - పొందూరు : మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఆలీబాబా 40 దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమిటని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మండల కేంద్రంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ ఆవరణలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూ.ఐదు కోట్లతో ఇంటింటా మంచినీటి కుళాయిల ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. తోలాపిలో వై నీడ్స్ ఎపి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ఎన్నో అవినీతి కుంభకోణాలు ఉన్నాయని ఆరోపించారు. టిడిపి హయాంలో విప్‌గా పనిచేసిన కూన రవికుమార్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో రహదారుల కాంట్రాక్టుల పేరుతో అన్నదమ్ములు ఇద్దరూ దోచుకున్నారని ఆరోపించారు. రెల్లిగెడ్డ ఆధునీకరణ పేరిట రూ.కోట్ల నిధులను మంజూరు చేయించి పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా, నాసిరకంగా పనులు చేయించడంతో నిర్మాణ దశలోనే అవి కొట్టుకుపోలేదా అని ప్రశ్నించారు. రవికుమార్ అవినీతి కారణంగా ఎనిమిది మంది ఇంజినీరింగ్ అధికారులు బలైపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కె.రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బి.సునీల కుమార్, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్, జి.నాగరాజు, జెసిఎస్ వెంకట కృష్ణారావు, వైస్ సర్పంచ్ అనకాపల్లి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.