ప్రజాశక్తి-అనకాపల్లి
వైసిపి నేతలు దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న విమర్శించారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన భూములను మంత్రి అమర్నాథ్ దోచుకుని అందులో విజయసాయి రెడ్డికి వాటాలు ఇచ్చారని ఆరోపించారు. అమరనాథ్‌కు మంత్రి పదవి రావడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. అమర్నాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తుల విలువ, ప్రస్తుత ఆస్తుల విలువపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాలు విసిరారు. టిడిపి అమర్‌నాథ్‌కు రాజకీయ భిక్ష పెట్టిందని, పార్టీ మారి మంత్రి పదవి వచ్చిన తర్వాత తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, లోకేష్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. అనకాపల్లిలో కాపు సామాజిక భవనానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ స్థలం ఇస్తే, ఆ స్థలాన్ని వైసిపి కార్యాలయంగా మార్చుకోవడం దారుణమన్నారు. అమర్నాథ్ ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పీలా గోవింద సత్యనారాయణ, పివిజి కుమార్, ప్రగడ నాగేశ్వరరావు, నాయకులు మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్నను సాలువతో కప్పి జ్ఞాపికతో సత్కరించారు.










