May 17,2023 23:40

సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరరావు

ప్రజాశక్తి- మాధవధార : విశాఖ జిల్లాలో రజక వృత్తిదారులకు స్థలాలు, దోబీఘాట్లును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. కంచరపాలెం సిఐటియు కార్యాలయంలో రజక వృత్తిదారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో రజక వృత్తిదారులు 50 వేల మంది ఉన్నారని, స్థలాలు, దోబీఘాట్లు లేక అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ మాల్స్‌లో, ఇళ్లల్లో పనివారుగా చేస్తూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా రజకులకు మోడ్రన్‌ దోబీఘాట్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లాండ్రీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని, లాండ్రీలకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుచేయాలని, మాధవధార, తెన్నేటినగర్‌, కంచరపాలెం, నరసింహనగర్‌, ఆర్‌పి.పేట, చాకలిగెడ్డ ప్రాంతాల్లో దోబీఘాట్లు నిర్మించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు టి.రాము, పి.ఈశ్వరరావు, టి.సోమయ్య, జి.సత్యం, బి.రాము, జి.రామ్‌శెట్టి, కె.గోవిందరావు, ఎన్‌.అప్పన్న, ఎ.అప్పారావు పాల్గొన్నారు.