Jul 31,2022 00:11

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఈశ్వరరావు

ప్రజాశక్తి- కంచరపాలెం : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యాన జివిఎంసి 56వ వార్డు పరిధి కంచరపాలెం సమీపంలోని దయానందనగర్‌ చాకలిగడ్డ, పైడిమాంబ కాలనీ దోబీఘాట్ల వద్ద రజకులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ, కంచరపాలెం పరిధిలో రజక వృత్తిదారులు సుమారు రెండువేల మందికి పైగా ఉన్నారన్నారు. రజకులకు పక్కా ఇల్లు, వృత్తి పరికరాలు లేక, దోబీఘాట్లకు మరమ్మత్తులు చేపట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కంచరపాలెం పరిధిలోని దయానందనగర్‌, పైడిమాంబ కాలనీ, సుభాష్‌ నగర్‌, బర్మా క్యాంప్‌, కామాక్షినగర్‌, కరాస, మాధవధార, మర్రిపాలెం ప్రాంతాల్లో దోబీఘాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీటికి మరమ్మతులు చేపట్టి రజకులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. దోబీఘాట్లకు కరెంటు మీటర్లు, నీరు నిలువ కుండీలు, పైన రేకుల షెడ్లు, మంచినీటి బోర్లు కల్పించాలని కోరారు. దీనిపై జివిఎంసి అధికారులకు ఎన్ని మార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైడిరాజు, కన్నా, లక్ష్మి, ఉమ, సత్యవతి, నూకరత్నం, పైడమ్మ, వరలక్ష్మి, మంజు పాల్గొన్నారు.