ధర్నా చేస్తున్న రజక సంఘం నాయకులు ఈశ్వరరావు, వృత్తిదారులు
ప్రజాశక్తి- గాజువాక : అప్పన్న కాలనీలోని రజకుల దోబీఘాట్ స్థలం ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యాన గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట రజకులు శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ, అప్పన్నకాలనీలో స్థలం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రజకులు వృత్తి చేసుకోవడానికి చాలా ప్రాంతాల్లో దోబీ ఘాట్‌లు లేవన్నారు. అప్పన్నకాలనీలో 1994లో స్థానికంగా ఉన్న రజకుల కోసం దోబీఘాట్ ఏర్పాటుచేశారని తెలిపారు. దాన్ని కబ్జా చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కె.త్రినాథ్ ఈ స్థలాన్ని ఆక్రమిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఆనందరావు, సత్తిబాబు పాల్గొన్నారు.










