Dec 15,2022 23:32

కెనాల్‌కు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జెన్‌కో ఉన్నతాధికారులు

ప్రజాశక్తి -సీలేరు
సీలేరు కాంప్లెక్స్‌ పరిధి, డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గురువారం తెల్లవారుజామున భారీగా గండి పడింది. దీంతో డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ గండిపడి వృధాగా నీరు ఏరులై పారింది. డొంగరాయి ఏవీపీ డ్యాం వరద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు పవర్‌ కెనాల్‌ గండి పడినట్లు గుర్తించి జెన్కో అధికారులు సమాచారం అందించారు. హటా హుటిన అధికారులు పవర్‌ కెనాల్‌ వద్ద చేరుకొని కెనాల్‌ నుంచి నీరు వృధాగా పోకుండా చర్యలు చేపట్టారు. ఈ సమయంలో డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేశారు. సుమారు 16 మీటర్ల వరకు కెనాల్‌కు గండి పడినట్లు తెలిసింది. 2019లో పవర్‌ కెనాల్‌కు గండి పడింది అప్పట్లో సుమారు మూడు కోట్లు రూపాయలు ఖర్చుతో గండి పూర్చారు. తాజాగా మళ్లీ కెనాల్‌కు గండి పడడంతో ఏపీ జెన్కోకు భారీ నష్టం నష్టం వాటిల్లితోంది.
గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు
డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండిపడిన సమాచారాన్ని జెన్కో ఉన్నతాధికారులకు మోతుగూడెం ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజనీర్‌ కెవి నాగేశ్వరరావు అందించారు. దీంతో ఏపీ జెన్కో హైడిల్‌ డైరెక్టర్‌ ఎంవివి సత్యనారాయణ, సీఈ (సివిల్‌) ఎస్‌ శేషారెడ్డితో కూడిన బృందం గురువారం సాయంత్రం గండిపడిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. గండిపడిన తీరును హైడల్‌ డైరెక్టర్‌ ఎంవివి సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. గండి పడిన ప్రదేశం నుంచి నీరు వృధాగా పోకుండా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఇ( సివిల్‌ ) కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి ఓ అండ్‌ డామ్‌ ఎస్‌ఇ బాలకృష్ణ, జాకీర్‌ హుస్సేన్‌ బాబురావుతో సమావేశమయ్యారు. పవర్‌ కెనాల్‌ గండి పడిన ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, విధి విధానాలతో కూడిన తుది నివేదికను హైడల్‌ డైరెక్టర్‌ ఎంవివి సత్యనారాయణతో కూడిన బందం జెన్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీధర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఎఇ కృష్ణారావు, సెక్యూరిటీ అధికారి రామకృష్ణ, పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.