Mar 04,2023 23:34

రెగ్యులేటరీ డ్యామ్‌ను పరిశీలిస్తూ ఇంజనీర్లకు సూచనలిస్తున్న రిటైర్డ్‌ ఎస్‌ఇ కోటేశ్వరరావు

ప్రజాశక్తి -సీలేరు
డొంకరాయి పవర్‌ కెనాల్‌, సీలేరు జలాశయాలను ఏపీ జెన్కో రిటైర్డ్‌ ఎస్‌ఇ (సివిల్‌) కె.కోటేశ్వరరావు శనివారం సందర్శించారు. ముందుగా దిగువ సీలేరు డొంకరాయి పవర్‌ కెనాల్‌, రిజర్వాయర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీలేరు చేరుకొని మెయిన్‌ డ్యాం, రెగ్యురేటరీ డ్యాంను పరిశీలించారు. కోటేశ్వరరావు 1970-80 మధ్య కాలంలో సీలేరు కాంప్లెక్స్‌ పరిధి డొంకరాయిలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడే డొంకరాయి పవర్‌ కెనాల్‌, రిజర్వాయర్‌ నిర్మాణాలు జరిగాయి. ఈ క్రమంలో శనివారం ఆయన వీటిని పరిశీలించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కెనాల్‌ లీకేజీలు జరిగితే ఏలా అరికట్టాలి, గ్రౌటింగ్‌ ఏ విధంగా చేయాలి అనే అంశాలను క్షుణ్ణంగా ఇంజనీర్లకు వివరించారు. పవర్‌ కెనాల్‌కు ముప్పు ఏర్పడితే అత్యవసర సమయాల్లో పనులు ఏ విధంగా చేపట్టాలి, కార్యాచరణ ఏవిధంగా రూపొందించాలి అనే అంశాలను వెల్లడించారు. గుంటవాడ రిజర్వాయర్‌ రెగ్యురేటరీ డ్యాంను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ బాబురావు, ఇన్‌ఛార్జి ఏడిఈ టెక్నికల్‌ కృష్ణారావు, ఏడిఈ క్యాంపు అప్పలనాయుడు, ఏఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
జియో లాజికల్‌ టెక్నికల్‌ బృందం పరిశీలన
డొంకరాయి పవర్‌ కెనాల్‌ను జియో లాజికల్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్‌ బృందం శుక్రవారం ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గతేడాది డిసెంబరు 14 అర్ధరాత్రి గండి పడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీ జెన్కో ఉన్నతధికారులు కెనాల్‌ పటిష్టపై జియో లాజికల్‌ టెక్నికల్‌ నిపుణులు బృందంతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో జియోలాజికల్‌ టెక్నికల్‌ ప్రొఫెసర్‌ యుఎస్‌.రాజు బృందం డొంకరాయి నుంచి ఫోర్‌ బై డ్యాం వరకు ఉన్న 16 కిలోమీటర్లు మేరకు పవర్‌ కెనాల్‌ను పరిశీలించారు. పవర్‌ కెనాల్‌కు గండి పడకుండా తీసుకోవలసిన చర్యలపై బృందం జెన్కో అధికారులకు పలు సూచనలు చేశారు. మరమ్మతు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీరు బి.శ్రీధర్‌, ఎస్‌ఈ సివిల్‌ కేకేవి.ప్రశాంత్‌ కుమార్‌, ఇన్చార్జి ఎస్‌ఇ బాలకృష్ణ, ఈఈలు బాబురావు, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.