ప్రజాశక్తి -సీలేరు
సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా అదనంగా గోదావరి డెల్టాకు 1700 క్యూసెక్కులు నీటిని గురువారం నుంచి విడుదల చేస్తున్నామని ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్ కేకేవి.ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. స్థానిక విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ సీలేరు, డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4300 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల అవుతుందని తెలిపారు. గోదావరి డెల్టా నీటి అవసరాలు ఉన్నందున ఇరిగేషన్ అధికారులు కోరడంతో డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా అదనంగా 1700 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని, నీటి విడుదల వారం రోజులు పాటు కొనసాగుతుందని తెలిపారు. దీంతో ప్రస్తుతం గోదావరి డెల్టాకు మొత్తం 6000 క్యూసెక్కులు నీరు విడుదల కొనసాగుతుందన్నారు. జల విద్యుత్ కేంద్రాల్లో గ్రిడ్ ఆదేశాల మేరకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. డొంకరాయి పవర్ కెనాల్ గండి మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయని, పవర్ కెనాల్‌కు ఇంజనీర్లుతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. పోల్లూరు జల విద్యుత్ కేంద్రంలో గురువారం 3.135 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి కాగా డొంకరాయిలో .402 మిలియన్ యూనిట్లు, సీలేరులో .679 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఆయన చెప్పారు.










