- రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు
- రూ. 43.99 కోట్లు విడుదలైనా ప్రారంభంకాని పనులు
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి
రహదారుల మరమ్మతులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కృష్ణాజిల్లాలో డొంక రోడ్ల మరమ్మతులకు రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు బిడ్డింగ్ వేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా మారిన డొంక రోడ్లకు ఎప్పటికి మోక్షం కలుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 175 కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిధులు మంజూరు చేసింది. 102 పనులకు రూ.43.99 కోట్లతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రెండుసార్లు టెండర్లు ఆహ్వానించింది. తాజాగా టెండర్లు తెరిచారు. గన్నవరం నియోజకవర్గంలో రూ.7.46 కోట్ల విలువైన 10 పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. మిగిలిన పనులకు కాంట్రాక్టర్లెవరూ ఆసక్తి చూపలేదు.
నియోజకవర్గాల వారీగా ఇలా
మచిలీపట్నంలో 10 పనులకు రూ.3.61 కోట్లు, అవనిగడ్డలో 20 పనులకు రూ.7.04 కోట్లు, పెడనలో 12 పనులకు రూ.7.38 కోట్లు, గుడివాడలో 16 పనులకు రూ.3.98 కోట్లు, పామర్రులో 20 పనులకు రూ.7.25 కోట్లు, పెనమలూరులో 14 పనులకు రూ.7.27 కోట్లు, గన్నవరంలో 10 పనులకు రూ.7.46 కోట్ల చొప్పున మొత్తం 102 పనులకు రూ.43.99 కోట్లు నిధులు మంజూరు చేశారు.
నిధులున్నా డొంకరోడ్లు పట్టించుకోరు
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వ్యవసాయ ఉత్పత్తులపై సెస్ వసూళ్లతోపాటు గోడౌన్లను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఈవిధంగా వసూలు చేసిన సెస్ జిల్లాలో రూ.79.52 కోట్లు నిల్వలున్నాయి. సాధారణంగా ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడే డొంక రోడ్లను రబ్బీసు రోడ్లుగా, తారురోడ్లుగా అభివృద్ది చేయాలి. గత మూడున్నరేళ్లలో జిల్లాలోని ఒక్క డొంకరోడ్డు కూడా అభివృద్ధికి నోచుకోలేదు.










