May 18,2023 00:09
గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

ప్రజాశక్తి-చిన్నగంజాం: దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ కె సురేష్‌ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం బుధవారం మండలం లోని రుద్రమాంబపురంలో ప్రజలతో దేవాల యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పని మీద వేరే ఊరికి వెళ్లేటప్పుడు తమ ఇళ్లల్లో ఉన్న విలువైన బంగారం, డబ్బులను బ్యాంకు లాకర్లో గాని, తమకు నమ్మకస్తుల అయినా వారి దగ్గర పెట్టుకొని వెళ్లాలన్నారు. సమాచారాన్ని స్థానిక సచివాలయంలోని మహిళా పోలీసుకు తెలపాల న్నారు. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి, ఆరు బయట పడుకునే వాళ్లు విలువైన బంగారం కలిగి ఉండకూడదన్నారు. అదేవిధంగా తమ ఇంటికి తాళాలు వేసుకోవాలని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తమ గ్రామాల్లో తిరుగుతున్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసరమైన సందర్భాల్లో 112కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ పోలీస్‌, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.