ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరంలో దొంగతనాలు అరికట్టడానికి, పౌరులకు భద్రత కల్పించేందుకు నిఘా పెంచుతున్నామని సౌత్ డివిజన్ లా అండ్ ఆర్డర్ ఎసిపి టి త్రినాధ్, క్రైమ్ ఎసిపి సిహెచ్ పెంటారావు తెలిపారు. ఉక్కునగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ఉక్కు నగరం పోలీసులు, 78వ వార్డు కార్పొరేటర్ సంయుక్తంగా స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎసిపిలు మాట్లాడుతూ, త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.ఉక్కునగరంలో సీసీ టీవీలను క్లస్టర్స్‌లో ఏర్పాటు చేసేలా, రాత్రి గస్తీకి హోంగార్డుల సంఖ్య పెంచేందుకు స్టీల్ యాజమాన్యంతో చర్చిస్తామని చెప్పారు. క్వార్టర్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేస్తే లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ చేపడతామని తెలిపారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలపై చర్యలు సాధ్యమన్నారు. డోర్ లాకింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా నివాస గృహాలపై నిఘా ఉంటుందని వివరించారు. దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. సాధారణంగా తాళం వేసిన ఇళ్లలో మాత్రమే దొంగ తనాలు జరుగుతాయని, అటువంటి సందర్భాలలో విలువైన వస్తువులను ఇంటిలో వదిలివేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, ఉక్కు నగరంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భయ్యా మల్లయ్య, స్టీల్ ప్లాంట్ సిఐలు వి.శ్రీనివాసరావు, పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ శ్రీనివాసరావు, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉక్కు నగర వాసులు, మహిళలు పాల్గొన్నారు.










