Dec 14,2022 23:58

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌ అడ్మిన్‌ విభాగాధిపతి చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందిస్తున్న కార్పొరేటర్‌ గంగారావు తదితరులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌ అడ్మిన్‌ విభాగాధిపతి చంద్రశేఖర్‌కి జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు ఆధ్వర్యాన ఉక్కునగరం సిపిఎం కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఉక్కునగరంలో ఈ నెల 11, 12 తేదీలలో సెక్టర్‌ 11లో 206 డి, సి, 827, 201డి, సెక్టర్‌ 6లోని 326 ఎఫ్‌, 328 ఇ క్వార్టర్లలో దొంగతనాలు జరిగాయని వివరించారు. డబ్బుతో పాటు పెద్దమొత్తంలో బంగారం, వెండి అపహరణకు గురైయిందని తెలిపారు. ఇంట్లో నిద్రించేవారిని బయపెట్టి లూటీచేశారని వివరించారు. ఈ ఘటనలు ఉక్కునగర వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయని తెలిపారు. వివిధ అవసరాలకోసం బయటకు వస్తున్న మహిళల మెడలలో ఉన్న బంగారం గొలుసులను లాక్కెళుతున్నారని, అడ్డుకోబోయిన వారిపై కత్తులతో దాడి చేసి గాయపరచిన విషయం మీకు తెలిసిందేనని వివరించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఉక్కునగరంలో దొంగతనాలు అరికట్టటానికి, ప్రజలకు రక్షణ కల్పించటానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వివిధ క్వార్టర్లలలో దొంగలు అపహరించిన డబ్బు, బంగారం, వెండి వస్తువులను వెంటనే రికవరి చేసి బాధితులకు ఇవ్వాలని కోరారు. స్టీల్‌ యాజమాన్యం పోలీస్‌ కమిషనర్‌తో చర్చలు జరిపి పోలీస్‌ గస్తీని పెంచే చర్యలు చేపట్టాలని కోరారు. స్టీల్‌ప్లాంటు యాజమాన్యం పరిధిలో 265 మంది హామ్‌గార్జులు ఉన్నారని, వీరందరికి స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యమే వేతనాలు చెల్లిస్తోందని, వీరిలో కనీసం ఐదుగురిని చొప్పున ప్రతి సెక్టర్‌కి రాత్రి గస్తీ కోసం కేటాయించాలని కోరారు. క్యాంపులు వెళ్లే వారి క్వార్టర్లకు ప్రతేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు టౌన్‌ అడ్మిన్‌లో ప్రతేక సెల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సెక్టర్‌లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఉక్కునగర వాసుల భద్రత కోసం స్టీల్‌ యాజమాన్యం ప్రతి నెలా పోలీసులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించాలని కోరారు.