
న్యూఢిల్లీ : పేదవారికి సహాయం అందిస్తూ.. మంచి నేతగా పేరు ప్రతిష్టలు సంపాదించాలనుకున్నాడు. సహాయం అందించాలంటే డబ్బులు కావాలి.. అందుకే దొంగతనాలను ఎంచుకున్నాడు. పాపం కథ రివర్సై..జైలు పాలయ్యాడు. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు ఇతర దేశాల్లో లగ్జరీ కార్లను దొంగతనం చేసి, ఆ డబ్బుతో పేదలకు సహాయం చేస్తున్న మొహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో జనవరి 7న పశ్చిమ ఢిల్లీలోని నారైనా ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని క్రైమ్ బ్రాంబ్ డిసిపి మోనికా భరద్వాజ్ తెలిపారు. ఇర్ఫాన్‌తో పాటు మరో ముగ్గురు సహచరులను కూడా అరెస్ట్ చేశామని అన్నారు. అతని నుండి ఖరీదైన జాగ్వర్, నిస్సన్ కార్లతో పాటు రెండు పిస్టల్స్, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని లాక్ చేసి వున్న నివాసాలను మాత్రమే తాము ఎంచుకుంటామని, నగదు, బంగారం మాత్రమే దొంగిలిస్తామని విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. రాబిన్ హుడ్ ఛారిటీ సంస్థ ద్వారా ఈ నగదును పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తుండటంతో ఆగ్రామంలో అందరూ అతన్ని గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారని పోలీసులు తెలిపారు. త్వరలో జరగనున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో బీహార్‌లోని తన సొంతజిల్లా అయిన సీతామర్హి నుండి పోటీ చేయాలని భావించినట్లు చెప్పారు. బీహార్‌లో యువనేతగా మారాలనేది ఇర్ఫాన్ కలగా చెప్పారు.