ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, వైసిపి సానుభూతిపరుల ఓట్ల తొలగింపు చర్యలు టిడిపినే చేస్తోందని విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం రాయదుర్గంలో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకుల తీరు 'దొంగే దొంగ' అని అరిచినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పది రోజుల క్రితం ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను విడుదల చేయగా తాము ఇంతవరకూ ఆ జాబితా పరిశీలనకు వెళ్లలేదన్నారు. 2018లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా బోగస్ ఓట్లు నమోదు చేసి కొన్నిచోట్ల విజయం సాధించిందన్నారు. దొంగ ఓట్లు నమోదు కాకపోతే ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే స్థానాలు కూడా దక్కేవి కాదన్నారు. ఇక రాయదుర్గం నియోజకవర్గంలో 2019 ఎన్నికల నాటికి 48 వేల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు 12 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 10శాతం సామాన్యులు దరఖాస్తు చేసుకుంటే మిగతా 90 శాతం టిడిపికి చెందినవే ఉంటాయన్నారు. కాగా రాయదుర్గం-భూపసముద్రం రోడ్డు నుంచి కలుగోడుకు, కనేకల్- ఉరవకొండ రోడ్డు నుంచి కలేకుర్తి మీదుగా గుండ్లపల్లి వరకూ బిటి రోడ్డు నిర్మాణానికి రూ.8.45 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ ఐ.శ్రీనివాసులు, వైసిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిటిపి గోవిందు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ వలిబాష, మున్సిపల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.