Jul 13,2023 21:59

నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

ప్రజాశక్తి-పాలకొండ : సీతంపేట మండలం మెట్టు హడ్డుబంగి గ్రామంలో వి.శోభారాణి ఇంట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెను గాయపర్చి, ఆరు తులాల బంగారు ఆభరణం దొంగిలించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సూచనలతో డిఎస్‌పి జి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో పాలకొండ సిఐ మురళీధర్‌, ఎస్‌ఐ శివప్రసాద్‌ చాకచక్యంగా గురువారం మధ్యాహ్నం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద దొంగను పట్టుకున్నారు. ఆరు తులాల బంగారు ఆభరణం కూడా స్వాధీన పర్చుకున్నారు. శోభారాణి ఇళ్లు, షాపు ఒకే చోట ఉండడంతో దొంగ బిస్కెట్లు కొనడానికి వెళ్లి ఇంట్లోకి చొరబడ్డాడు. వంటగదిలో ఉన్న ఆమె తలపై దాడిచేసి, మెడలో ఉన్న బంగారు ఆభరణం అపహరించాడు. దీంతో పాలకొండ సిఐ దర్యాప్తు చేపట్టారు. దగ్గర్లో ఉన్న వసతి గృహంలో పనిచేస్తున్న వంటమనిషి రమణమ్మ.. దొంగను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన నిమ్మల రమేష్‌గా గుర్తించారు. అయితే ఐటి టీం ఆధారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 4 బృందాలు ఏర్పాటు చేసి నిందితుడు సెల్‌ఫోన్‌ ఆధారంగా గురువారం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ దగ్గర పట్టుకుని విచారించారు. కాంప్లెక్స్‌ వెనుక భాగంలో ఉన్న వెంకటరాయుని కోనేరు దగ్గర బంగారం దాచిపెట్టినట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిఐ, ఎస్‌ఐలను డిఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.