బట్టబయలైన అదానీ గ్రూపు హవాలా లీలలు నరేంద్రమోడీ సర్కారును బోనులో నిలబెట్టాయి. మోడీ ప్రభుత్వ మాటల డొల్లతనాన్ని, క్రోనీ క్యాపిటలిజాన్ని దేశ ప్రజల ముందు బహిరంగ పరిచాయి. కరోనా విజృంభణతో ప్రజానీకం నిస్సహాయంగా మారిన వేళ గౌతమ్ అదానీ ఆస్తులు అంచనాలకందని విధంగా పెరిగిన తీరు వెనుక దాగిన దేశ ద్రోహాన్ని, కపట బుద్దిని విస్పష్ట పరిచాయి. ఏ ద్రోహ చింతన లేకపోతే అక్రమార్కుల అడ్డాగా, పన్ను ఎగవేతదారుల స్వర్గంగా ప్రసిద్ధి కెక్కిన మారిషస్ దీవుల కేంద్రంగా లావాదేవీలు జరపడం ఎందుకు? పెట్టుబడులు పెట్టిన విదేశీ ఖాతాలా వివరాల వెల్లడిలో గోప్యత ఎందుకు? కేవలం పన్ను ఎగవేతే లక్ష్యమా? లేక విజరుమాల్యా మాదిరి అవసరమైతే విదేశా లకు ఎగిరిపోయే వ్యూహమా? అసలవి విదేశీ ఖాతాలేనా... అక్రమార్జనను ఆ దేశం, ఈ దేశం తిప్పి హవాలా మార్గంలో తీసుకు వచ్చే బినామీ మాయాజాలమా... నిగ్గుతేలాల్సి ఉంది. అహ్మదా బాద్ లోని మధ్యస్థాయి కంపెనీయైన అదానీ గ్రూపు అతి స్వల్ప కాలంలో దేశంలో, ఆ మాటకోస్తే ఆసియా ఖండంలో అత్యున్నత స్థాయి సంస్థగా ఎలా ఎదిగింది? మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో లక్షల కోట్ల రూపాయలను ఎలా పోగేసుకుంది? రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే అదానీకి దఖలు పరచని ప్రాజెక్టు దేశంలో ఏముంది? అదానీ గ్రూపునకు చెందిన ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్చి 2020 నుండి 455 శాతం పెరిగితే, అదే సమయంలో దేశంలోని 1,000 అత్యున్నత లిస్టెడ్ సంస్థలు 80 శాతం పెంపుదలకు పరిమితం కావడంలో అర్ధమేమిటి? ఒకవైపు అదానీ వద్ద సంపద పోగు పడుతుంటే, మరోవైపు భారతీయ జనతా పార్టీకి ఊరుపేరు లేని ఎలక్టొరల్ బాండ్ల రూపంలో విరాళాలు వెల్లువెత్తిన మాట వాస్తవం కాదా? 43 వేల కోట్ల రూపాయల అనుమానిత లావాదేవీల విషయాన్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్) వెలుగు లోకి తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఈ వ్యవహారంపై పెదవి విప్పకపోవడం దేనికి సంకేతం? దీని వెనుక మోడీ సర్కారు పెంచి పోషిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు 'నీకింత..నాకింత' నికృష్టపు పంపిణీలు లేవని చెప్పగలమా!
అదానీ అకృత్యాలకు, అంతులేని లాభాపేక్షకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును, సెజ్‌ను అదానీ గ్రూపు సొంతం చేసుకుంది. విశాఖ పోర్టు బెర్త్ వ్యవహారంలో చేతివాటం చూపి వంద కోట్లకు పైగా టోకరా పెట్టడానికి సిద్ధమైనప్పటికీ గంగవరం పోర్టును అప్పనంలా అప్పగించడానికి ఉవ్విళూరుతోంది. అభివృద్ధికి పోర్టులు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి పోర్టులను కార్పొరేట్లకు అప్పగించవద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంటునూ అదానీకి అప్పగించడానికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవిగాక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, గ్రీన్ డేటా సెంటర్లు అంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలపైనా అదానీ గ్రూపు కన్నేసింది. ఈ పంపకాలన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కాస్తా అదానీ ప్రదేశ్‌గా మారిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించాలి. ప్రజల ఆస్తులను స్వార్ధమే తప్ప దేశ క్షేమం కొంచెం కూడా పట్టని అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం మానుకోవాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణకు కట్టుబడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆశ్రిత పెట్టుబడీదారి విధానం మోడీ సర్కారు హయంలో పతాకస్థాయికి చేరింది. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న అన్ని రకాల దోపిడీకి, అన్యాయాలకు, అక్రమాలకు ఈ విధానమే కారణం. ఫలితంగా దేశంలో అసమానతలు భారీగా పెరిగాయి. సామాన్యుడి బతుకు దుర్భరంగా మారింది. ఈ దుస్థితి నుండి బయట పడాలంటే ఆర్భాటపు మాటలే తప్ప చేతలు శూన్యమైన మోడీ నేతృత్వంలోని డొల్ల సర్కారును సాగనంపడం ఒక్కటే మార్గం! దీనికోసం ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి.










