
ప్రజాశక్తి-అనకాపల్లి
రైతాంగ, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన తొలి తరం సిపిఎం నాయకులు కామ్రేడ్ దొడ్డి రాము నాయుడుకు ఆ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో సోమవారం రామునాయుడు 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ, మండల కన్వీనర్ గంట శ్రీరామ్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్రావు, జి కోటేశ్వరరావు రామునాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తొలితరం కమ్యూనిస్టు నేతలను స్ఫూర్తిగా చేసుకుని దొడ్డి రామునాయుడు అప్పటివరకు తాను నిర్వహిస్తున్న వ్యాపారాలను విడిచిపెట్టి, పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా రైతాంగ కార్మిక సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అతివాద మితవాద పోకడలను కాదని వాస్తవ దక్పథంతో వ్యవహరిస్తున్న సిపిఎంలో చేరి విశాఖ జిల్లాకు కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండాను మహోన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేశారన్నారు. పార్టీ కార్యకర్తలను తమ సొంత బిడ్డల్లా భావించి వారి అభివృద్ధికి ఉద్యమ పురోభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యాలను నిరసిస్తూ వారికి ఉపశమన చర్యల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రభుత్వం బెల్లం క్రషర్లపై ఆంక్షలు విధించినప్పుడు రైతాంగం పక్షాన నిలబడ్డం, ఎరువులు కృత్రిమ లోటు కల్పించినప్పుడు గోడౌన్లను బద్దలు కొట్టి రైతులకు ఎరువులు పంపిణీ చేసిన ఘనత కామ్రేడ్ రామునాయుడుకే దక్కుతుందన్నారు. ఆయనను స్ఫూర్తిగా చేసుకుని నేటి కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏ.రాజు, ఉమామహేశ్వరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, బి నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.