ప్రజాశక్తి-పాలకొండ : టిడిపారాపురం గ్రామంలో డంపింగ్‌యార్డు నిర్మాణానికి కౌన్సిలర్లు అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కోరారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీకి డంపింగ్‌యార్డ్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. పాలకొండను పరిశుభ్రంగా ఉంచేందుకు డంపింగ్‌యార్డ్ అవసరం ఉందన్నారు. దీనికి కౌన్సిలర్లు అందరూ సహకరించాలని కోరారు. ఈ విషయంలో తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని, అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. డంపింగ్‌యార్డ్ నిర్మాణం చేపట్టి తీరుతామని తెగేసిచెప్పారు. దసరా నాటికి ఈ పనులు పూర్తి చేయాలన్నారు. విద్యుత్తు శాఖ ఎఇ గోరు రమేష్‌పై ఎమ్మెల్సీతోపాటు కౌన్సిలర్లు మండిపడ్డారు. నగర పంచాయతీకి సంబంధించి రూ.30 లక్షలు నిధులు విద్యుత్తు స్తంభాలకు కేటాయిస్తే, కనీసం ఆయా వార్డుల్లో ఎక్కడ వేయాలన్న అంశంపై కౌన్సిలర్లను సంప్రదించకపోవడంపై మూకుమ్మడిగా నిలదీశారు. ఎఇ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్సీ మందలించారు. సమావేశంలో చైర్‌పర్సన్ యందవ రాధాకుమారి, వైస్‌చైర్మన్లు పల్లా ప్రతాప్, హనుమంతురావు, కమిషనర్ సర్వేశ్వరరావు, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, వెలమల మన్మథరావు, గంగునాయుడు, కిల్లారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.










