ప్రజాశక్తి-పాలకొండ : స్థానిక నగర పంచాయతీకి సంబంధించి మండలంలో టిడిపారాపురంలోని ఐదెకరాల స్థలం కేటాయించగా గతంలో రెండుసార్లు ఆ పనులు చేయడానికి వెళ్లిన అధికారులను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి వివాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్‌కు కేటాయించిన స్థలంలో పనులు ప్రారంభించడానికి నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు సిద్ధమయ్యారు. సిఐ మురళీధర్, ఎస్‌ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో పనులు చేపడుతుండగా గ్రామస్తులు డంపింగ్ యార్డ్ చేపట్టడానికి వీలులేదని, కోర్టు స్టే ఉందని చెప్పారు. దీంతో అక్కడకు చేరుకున్న ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్ నగర పంచాయతీకి గతంలో కలెక్టర్ డంపింగ్ యార్డ్ కోసం ఇక్కడ స్థలం కేటాయించారని, కచ్చితంగా పనులు చేపట్టి తీరుతామని చెప్పగా గ్రామస్తుల తరుపున టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు అడ్డుకున్నారు. ఇదే సర్వే నెంబర్‌లో 8 ఎకరాల స్థలాన్ని పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వైద్యశాల నిర్మించేందుకు గతంలో అప్పటి కలెక్టర్ ధనుంజయరెడ్డి మంజూరు చేశారని, ఈ ప్రాంతవాసులకు ఇదే ఆధారమని, ఇక్కడ డంపింగ్ యార్డ్ చేపట్టి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసు కుంది. ఈ కొండనీరే తమ వ్యవసాయానికి ఆధారమని, వేరేచోట నిర్మించుకోవాలని చెప్పగా పిచ్చుకమీద బ్రహ్మస్త్రాలు వేయడం తనకు ఇష్టం లేదని, డంపింగ్‌యార్డ్ నిర్మాణానికి సహకరించాలని ఎంఎల్‌సి అనడంతో గ్రామస్తులు నిలదీశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కోర్టులో ఉన్న విషయంపై అవగాహన లేకుండా రావడమే తప్పని కర్నేన అప్పలనాయుడు నిలదీశారు. గ్రామస్తుల బాధలు మీకు పట్టవని, ప్రజలు ఓట్లుతో గెలిస్తే ఆ బాధలు తెలుస్తాయని టిడిపి మహిళా నేత కర్నేన యోగిత అనగా ఎంఎల్‌సి విరుచుకుపడ్డారు. ఇంటికి వెళ్లి వంట చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయడమేమిటని ఆమెను ప్రశ్నించారు. మీ ఇంట్లో మీ అమ్మకు, మీ భార్యకు మరెందుకు పదవులు ఇచ్చారని ఎంఎల్‌సిని ప్రశ్నించారు. దీంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సముదాయించారు. దీంతో పనులు నిలిచిపోయాయి.










