Apr 20,2023 01:28
బయో మైనింగ్‌ ప్రారంభిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ విజయ సారథి

ప్రజాశక్తి-రేపల్లె: డంప్‌ యార్డులోని చెత్తను బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా తొలగించే యంత్రా లను బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ బి విజయ సారథి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 1957లో ఆనాటి పాలకులు 1.6 ఎకరాలలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధునాతన పద్ధతిలో యంత్రాలను అమర్చి బయోమైనింగ్‌ ద్వారా చెత్తను తొలగించే పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. డంపు యార్డులో పేరుకుపోయిన టన్నుల కొలది చెత్తను 3 మాసాల్లో తొలగించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఉన్నారని తెలిపారు. చెత్తలోని వ్యర్థాలను విడివిడిగా చేయడంతో పాటు బయోమైనింగ్‌ ఎరువును తయారు చేస్తుందని చెప్పారు. బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా చెత్తను వివిధ దశల్లో శుద్ధి చేయడం వల్ల పెద్ద ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు, కర్రలు, దుస్తులు, బ్యాగులు, ఇతర వ్యర్థాలు వేరువేరుగా బయటకు వస్తాయన్నారు. ప్లాస్టిక్కు సంబంధించిన వ్యర్థాలను పైపుల పరిశ్రమలకు తరలిస్తారు. ఇటుకలు, కంకర రాళ్లు వంటి వ్యర్థాలను రహదార్ల గుంతలను పూడ్చటానికి ఉపయోగిస్తారు. మిగిలిన మట్టిని జల్లెడ పట్టి ఎరువు తయారు చేసేందుకు వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కట్టా మంగ, వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ కుమార్‌, తూనుకుంట్ల విశ్వనాథ గుప్తా, కట్టా సుబ్బారావు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు.