ఇంకా ఏ ఉదయమూ
స్వేచ్ఛా రెక్కల్నీ విప్పుకోలేదు
ఏ రాతిరీ భయం ముడులు పారదోల లేదు
అంతా గగుర్పాటు ఘడియలు
కనిపించి వినిపిస్తున్నాయి
అహం తలకెక్కితే
మనిషి, మనుషుల్ని మరచే
మరణ తంత్రుల కాలమిది
స్వేచ్ఛను హరించి
కర్కశంగా దేహాల్ని కూల్చి
రక్త వాసనలతో
హింస రాజ్యమేలుతున్న
దుఃఖ సమయమిది
ఆధిపత్యం అన్నది
అహంకార భాణమై
కత్తుల్ని దూస్తోంది
అమాయక ప్రాణాలు విల, విలలాడుతూ
దేశం దుఃఖ గీతాన్ని ఆలపిస్తూ విలపిస్తోంది
శాంతిచర్చలు నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్నాయి
మనిషి ఇప్పుడు
తన చరిత్రపు నీడను
తనే నరుక్కొంటున్నాడు
హింసతో వివేకాన్ని మరుస్తున్నాడు
రాజ్యంకోసం రాక్షస క్రీడలు రచిస్తున్నాడు
అందలం కోసం అర్రులు చాస్తున్నాడు
దేశ దారిద్య్రానికి ఈ దమన కాండల్ని రాజేస్తూ
మనిషి పతనానికి తనే
రూపకర్తగా నిలుస్తున్నాడు..!!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415