మాచర్ల: 'దమ్ముంటే నా మీద చేసిన ఆరోపణలను నిరూపించగలవా లోకేష్' అంటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సవాల్ విసిరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. గతంలో ఆగస్టులో వచ్చిన లోకేష్ మాచర్లను దత్తత తీసుకోని అభివృద్ధి చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మరో ఆగష్టులో వచ్చి వరికపూడిశెల ప్రాజెక్ట్‌కు ఫేక్ జివో ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారని, ప్రస్తుత ఆగస్టులో వచ్చి వరికపూడిశెల ప్రాజెక్ట్‌కు శంకు స్ధాపన అంటున్నారని వివరించారు. వచ్చే ఆగస్టుకు తండ్రీ కొడుకులను ఇద్దరిని హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రికి ఆంధ్ర ప్రజలు పంపిస్తారని వ్యాఖ్యలు చేశారు.వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్‌ను ,తాను మాచర్లలో ఏకగ్రీవంగా వార్డు మెంబర్‌గా గెలిపిస్తానంటూ సెటైర్లు విసిరారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, నియో జకవర్గంపై అవగాహనతో మాటాడాలని లోకేష్‌కు సూచిం చారు. 'నువ్వు పెట్టిన పెయిడ్ ఆర్టిస్టు ఇప్పటికే నాపై రెండు సార్లు ఓడి గుంటూరు పారిపోయారు' అని గుర్తుచేశారు. ఐదుసార్లు మాచర్ల ప్రజలు తనను గెలిపించిన అంశాన్ని గుర్తు పెట్టుకోవా లన్నారు. యరపతినేని, చంద్రబాబు, లోకేష్‌ల వద్ద ప్యాకేజీలు మాట్లాడుకునే బ్రహ్మరెడ్డికి తమను విమర్శించే స్థాయి లేదన్నారు. సమావేశంలో వైసిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.










