ప్రజాశక్తి-కాకినాడ తనను ఒక అరాచక శక్తిగా, మాఫియా డాన్‌గా చిత్రీకరించి తన పేరు పెట్టి కూడా ఈనాడు పత్రికలో రాయడానికి భయపడ్డారని కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని తాను చెప్పడం వల్లనే ఈ తప్పుడు వార్తలు తనపై రాశారన్నారు. కులగజ్జితో తనపై విష ప్రచారం చేయాలని చంద్రబాబు, రామోజీరావు కలిసి ఆడిన నాటకమని అభివర్ణించారు. లోకేష్ యాత్రలో తనను చెడుగా చూపించడానికి ఈ వార్తలు రాయించారన్నారు. చంద్రబాబు, రామోజీరావు లేకపోతే ఆంధ్ర ప్రదేశ్‌లో కుల రాజకీయాలు ఉండమన్నారు. తన పేరు పెట్టి రాసే ధైర్యం లేకపోయినా తాను ధైర్యంగా ముందుకు వచ్చి సవాలు విసురుతున్నానన్నారు. తాను ఎలాంటి వాడినో కాకినాడలో రెండో అతిపెద్ద కంపెనీ అయినా చౌదరిని అడగాలన్నారు. కావాలని నిందలు వేయడం తప్ప ఈనాడు పేపర్లో వచ్చినవన్నీ కూడా అవాస్తవాలే అన్నారు. భూదాన భూములు తనకు సంబంధం లేదని అది తన నియోజకవర్గానికి చెందినది కాదని స్పష్టం చేశారు. తనపై కావాలని ఆరోపణలు చేయడం తప్ప పేరు పెట్టి రాయలేకపోయారని దీన్నిబట్టి వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలను రుజువైందన్నారు. అనంతరం తమ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అవాస్తవాలు రాశారని ఈనాడు పత్రికను వైసిపి కార్యకర్తలు దగ్ధం చేసి నిరసన తెలిపారు.










