Apr 28,2023 19:42

సమావేశంలో మాట్లాడుతున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై పోటి చేసి గెలిచి చూపించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్‌ రెడ్డి సవాలు విసిరారు. లోకేష్‌ పర్యటనలో భాగంగా కోసిగి బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని విషనాగని విమర్శించడంతో పైవిధంగా ఆయన స్పందించారు. శుక్రవారం మండలంలోని చిలకలడోన గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము ఎప్పుడూ ప్రజల మనుషులమని, ప్రజల్లోనే ఉంటామని తెలిపారు. విష నాగా లేక ఆదుకునే మనిషో ఇక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. 2024 ఎన్నికల్లో బాలనాగిరెడ్డిపై పోటీ చేసి లోకేష్‌ గెలిస్తే ఇక్కడ ఉన్న ఆస్తులను అమ్ముకుని వెళ్తామని సవాలు విసిరారు. మామను నమ్మించి వెన్నుపోటుతో చంపిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఘనత తమని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని, తమ కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారని తెలిపారు. లిక్కర్‌ తాగే అలవాటు తనకు లేదని, తాము లిక్కర్‌ మాఫియా సాగిస్తామా అని ప్రశ్నించారు. తమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని, ధనికులతో చేసే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పేదల పొట్టకొట్టాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. పెద్దకడబూరులో రామ్మోహన్‌ రెడ్డి భూ కబ్జా చేశారని చెప్పారు, లింక్‌ డాక్యుమెంట్లు చూపిస్తాం రండని చెప్పారు. కోసిగిలో ఎమ్మెల్యే భూకబ్జా చేయలేదని, నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూమి తీసుకున్నారని తెలిపారు. తమ బాబాయిలు శివరామిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యేగా, సాయిప్రసాద్‌ రెడ్డి మూడు పర్యాయాలు ఆదోని ఎమ్మెల్యేగా, బాలనాగిరెడ్డి వరుసగా హ్యాట్రిక్‌ విజయంతో మంత్రాలయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని చెప్పారు. లోకేష్‌ బాబు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువకుండా, అడ్డదారిలో శాసనమండలి ద్వారా ఎన్నికై మంత్రి పదవి పొందారని, అలాంటి వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. పులికనుమ రిజర్వాయర్‌ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంజూరు కాగా, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి 5 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు మంజూరు చేయించారని, హెడ్‌ వర్క్స్‌ పనులు కూడా కొనసాగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పులికనుమ ప్రాజెక్టు, చిన్నతుంబలం చెరువులో చేపల పెంపకానికి ప్రభుత్వ అనుమతితో ఆదోనికి చెందిన వ్యక్తి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధి ప్రభుత్వ పరిధిలోకి రాదని, మఠం యాజమాన్యం, భక్తుల సహకారంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శ్రీమఠం ముందు నూతనంగా నిర్మించిన కారిడార్‌కు లోకేష్‌, చంద్రబాబు వచ్చి రోడ్డు వెడల్పు చేసి పెయింటింగ్‌ చేసినట్లుగా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో టెంకాయల వేలం దక్కించుకుంది టిడిపి కార్యకర్త కాదా అని తెలిపారు. తాము రాజకీయం చేయాలనుకుంటే వారికి టెండర్‌ దక్కేదా అని ప్రశ్నించారు.