Apr 19,2023 19:49

నిరసన తెలియజేస్తున్న నాయకులు, మహిళలు

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని మాధవరం దళితవాడలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం మాధవరం గ్రామం దళిత కాలనీలోని మహిళలు ఖాళీ బిందెలతో 167వ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.అంజిబాబు, సిపిఐ నియోజకవర్గ నాయకులు భాస్కర్‌ యాదవ్‌ మాట్లాడారు. దళితపేటలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. గత 30 ఏళ్లుగా తాగునీటి సమస్య కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర నది పక్కనే ఉన్నా తాగునీటి సమస్య ఉండడం దురదృష్టకరమని తెలిపారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ ప్లాన్‌ ద్వారా నిధులను సమీకరించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకపోతే పంచాయతీలకు వస్తున్న 15వ ఆర్థిక ప్రణాళిక నిధులను కేటాయించి పైప్‌ లైన్లు వేసి తాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. వేసవిలో సమస్య తలెత్తకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని కోరారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, దళితపేటలో బోర్లు వేసేందుకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ... వారం రోజుల్లోపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి జయరాజు, సిపిఐ మండల నాయకులు లక్ష్మణ్‌ సింగ్‌, నాయకులు మారెప్ప, సురేష్‌, కుమార్‌, వీరేష్‌, నాగప్ప, బాబురావు, మధు కుమార్‌, చార్లెస్‌, సామ్యేల్‌ పాల్గొన్నారు.