ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్: మాకవరపాలెం మండలం పైడిపాల గ్రామ దళితులు నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో దళితులు మాట్లాడుతూ,మాకవరపాలెం మండలం పైడిపాల గ్రామానికి చెందిన గుడాల వీరస్వామి తన ఐదుగురి కుమారుల ఉమ్మడి భూమి(సీలింగ్ భూమి) పట్టా నెంబరు 1316 సర్వే నెంబరు 710/1లో 1.95 సెంట్లలో జగనన్న కాలనీకి 0.65 సెంట్లు తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఇచ్చిన నష్టపరిహారం రూ. 11,61,875లు ఐదుగురు కొడుకులకు సమానంగా రూ.2,32,375 చొప్పున వేయకుండా ఇద్దరి పేరున కొంత డబ్బులు వేశారన్నారు. రెవెన్యూ అధికారులు, పంచాయతీ సర్పంచ్, సర్పంచ్ భర్త కలిసి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
బిఎస్పీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్టా నాగరాజు మాట్లాడుతూ, ఐదుగురు కుమారులకు సరిసమానంగా నష్టపరిహారం పంపిణీ చేయకుండా చట్టవిరుద్ద చర్యలకు పాల్పడ్డారో ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడాల వీరస్వామి ఐదుగురు కుమారులకు చెందిన 1.95 సెంట్లలో 0.65 జగనన్న కాలనీ పోగా మిగిలిన భూమి 1,30 సెంట్లు ఐదుగురు కుమారులకు, వారి వారసులకు 0.26 సెంట్లు చొప్పున మ్యూటేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలన్నారు. గుడాల వీరాస్వామి పట్టా నెంబరు 1316లో గల 1.95 సెట్ల 0.65 సెంట్లు జగనన్న కాలనీకి పోగా మిగతా 1.30 సెట్లు భూమిని సర్పంచ్ రుత్తల జ్యోతి, ఆమె భర్త రుత్తల శ్రీనులు అక్రమంగా, దౌర్జన్యంగా ప్లాట్ల రూపంలో సెంటు లక్షల్లో అమ్మేస్తున్నారని, వీరిపై ఎస్సీ, ఎస్టీ, పిఒఎ చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు సిపిఎం నాయకులు డి.సత్తిబాబు మద్దతు తెలిపారు.










