ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మోడీ హయాంలో దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి అన్నారు. దళితుల సామాజిక న్యాయం కోసం విజయవాడలో 29న నిర్వహించే మహాధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. శివనాగరాణి మాట్లాడుతూ మనువాద బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టాక దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. మణిపూర్ ఘటనలు దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, దళిత యువకుణ్ణి ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి ఇంటికి పార్శిల్ చేశారని గుర్తు చేశారు. అయితే దళిత, గిరిజనులకు రక్షణగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా, నిందితులకు 41 సిఆర్‌పిసి ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల కుల దురంహకారులకు అదుపు లేకుండా పోతుందని అన్నారు. స్టేషన్ బెయిల్ ఇవటాన్ని వెంటనే ఆపాలని, కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు ప్రభుత్వం ప్రచారం చేసి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు, చర్మకారులకు ఇస్తున్న పింఛనును రూ.5 వేలకు పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్న ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని, పాత బకాయిలు రద్దు చేయాలని కోరారు. ఈ అంశాలపై చేసే ధర్నాలో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కెవిపి ఎస్ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, సహాయ కార్యదర్శి ఎం.విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.రోశ య్య, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, నాయకులు జె.రాజ్ కుమార్, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.










