Aug 23,2023 18:38

పివి.రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్‌రావు
ప్రజాశక్తి - భీమవరం

          స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా దళితులపై నేటికీ దాడులు జరగడం దారుణమని పివి.రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు వరప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని వాండ్రంలో దళితులపై దాడి ఘటనను ఖండిస్తూ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ ఆధిపత్య సామాజిక తరగతులకు చెందిన గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 400 మంది కత్తులు, కర్రలతో దళితపేటలోకి దౌర్జన్యంగా చొరబడి దళితులపైన దాడి చేయడమే చర్చిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నపటికీ దళితులపైన దాడులు, దళిత మహిళలపైన హత్యలు, అత్యాచారాలు, కుల వివక్షత దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రాజకీయపార్టీ నాయకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారన్నారు. దళితపేటపై దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్‌ చేయకుండా ఆధిపత్య సామాజిక తరగతులవారికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఎస్‌సి ఎస్‌టి మోనటరింగ్‌ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ మాట్లాడుతూ ఎవరైతే దళితులపై అమానుషంగా దాడికి పూనుకున్నారో వారిపై ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేయాలని, బాధితులకు, దళితులకు రావాల్సిన రాయితీలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26వ తేదీ లోపు నిందితులను అరెస్ట్‌ చేయకపోతే అన్ని దళిత, ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమించి మరో గరగపర్రు ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ బోర్డు మెంబర్‌ పెదపాటి పెద్దిరాజు, సీనియర్‌ దళిత నాయకుడు కోరం ముసలయ్య, రాష్ట్ర కార్యదర్శులు కొర్రపాటి వీరాస్వామి, గోడి పెద్దిరాజు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.