29న విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా
నేటి నుంచి 25 వరకూ సంతకాల సేకరణ
ప్రజాశక్తి - ఏలూరు
దళితులపై దాడులు అరికట్టాలని, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మణిపూర్‌లో మనువాదులు ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాచారం చేయడం యావత్ భారతాన్ని తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోడీ నోరుమెదపక పోవడం దారుణమన్నారు. ఈ ఘటనలను మన రాష్ట్ర పాలకవర్గాలు ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. దళితులను ఆదిపత్య కులాలు పాలక పార్టీలకు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నాయి తప్ప వారిని మనుషులుగా చూడడంలేదని విమర్శించారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందని, రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో కూడా రోజు రోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయని, దళితుల హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయన్నారు. దళితులకు భూపంపిణీ చేయడానికి వచ్చిన భూ చట్టాలను, 9/77 అసైన్డ్ చట్టాలను కాలరాసి దళితులకు భూమి లేకుండా చేస్తుందని దుయ్యబెట్టారు. భూస్వాముల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 29న విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించబోతున్నామన్నారు. ఈ ఆందోళనా పోరాటంలో యావన్మంది దళితులు, ప్రజాతంత్ర వాదులు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని కోరారు. దీనిలో భాగంగా జిల్లాలో దళిత రక్షణ యాత్రలో సామాజిక న్యాయం రక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు ఈనెల 17 నుంచి 25 వరకూ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తామా ముత్యాలమ్మ, ఎ.రవి, వై.నాగేందర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహంకాళి రావు, రాజమండ్రి దానియేలు, సీనియర్ నాయకులు సత్తు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మాధవ, ప్రభాకరావు, దుర్గ, సుబ్బారావు, రవీంద్ర పాల్గొన్నారు.










