Sep 20,2023 21:28

ప్రజాశక్తి - ఏలూరు
  దళితులపై దాడులు అరికట్టి, సామాజిక న్యాయం పెంపొందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. సామాజిక న్యాయంకై ఈనెల 29న విజయవాడలో జరుగుతున్న మహాధర్నాని జయప్రదం చేయాలని కోరారు. మహాధర్నా వాల్‌పోస్టర్స్‌ను బుధవారం స్థానిక అన్నే భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు, దళితులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, అసలైన దళితులు, పేదలకు ఈ నిధులు అందకపోవడం వలన నేటికీ దళిత అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టడం కోసం తీసుకువచ్చిన అత్యాచార నిరోధక చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. దళిత హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 29న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని, దీనికి దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతిఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రవి, కెవిపిఎస్‌ నాయకులు ఇస్సాకు, బాలరాజు, మహిళా నాయకురాలు హైమావతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.సత్యం పాల్గొన్నారు.