Nov 05,2023 20:10

ఎస్‌కోట: కళ్లకు గంతులు కట్టుకుని నిరసన తెలుపుతున్న కోళ్ల

ప్రజాశక్తి- విజయనగరం కోట : రాష్ట్రంలో దళితులపై దాడులు ముఖ్యమంత్రికి పట్టవా? అని టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రవిభాస్కర్‌ మండిపడ్డారు. ఆదివారం నగరంలో అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఈ నెల 3న కృష్ణా జిల్లా నందిగామలో దళిత యువకుడిని అక్కడ దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమారుడు, వారి అనుచరులు దాడి చేసి, నోటిలో మూత్రం పోయడం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్ని దాడులకు పాల్పడినా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని సిఎం జగన్‌ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ పార్లమెంటరీ అధికార ప్రతినిధి డి.రాంబాబు, నగర అధ్యక్షులు కె.పైడిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు గుండెల ప్రకాశ్‌, మాజీ కౌన్సిలర్‌ ఎం.పైడిరాజు, డి.బుజ్జి, బి.అప్పారావు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: దళితులపై దాడులు, దారుణాల్లో ప్రథమ ముద్దాయి జగన్‌ రెడ్డేనని నియోజకవర్గ టిడిపి ఇంచార్జి కోళ్ల లలిత కుమారి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితులను అన్ని రకాలుగా అణచివేస్తున్న జగన్‌ రెడ్డికి, మంత్రులకి యాత్ర చేసే హక్కు లేదన్నారు. దళితులే ధ్యేయంగా బలహీన వర్గాలే లక్ష్యంగా రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రంలో పేట్రేగిపోతుందన్నారు పాలకు లుగా తమ వారు ఉన్నారన్న ధైర్యంతోనే ఆ వర్గం తెగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భీసెట్టి అరుణ, నానిగిరి రమణాజీ, మళ్లేశ్వర రావు, మహిళలు పొలమరశేట్టి మహా లక్ష్మీ, బోనంగి జ్యోతి, ఛక్కా కిరణ్‌, అనకాపల్లి చెల్లయ్య, తదితరులు పొల్గొన్నారు.
నెల్లిమర్ల: దళితుల పై జరుగుతున్న దాడుల పట్ల టిడిపి నాయకులు ఆదివారం నెల్లిమర్లలో నిరసన వ్యక్తం చేశారు. టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు గంధవరపు హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక రామ తీర్థం జంక్షన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు. నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగారాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో దళితుల పై దాడుల మరింత పెరిగి పోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి దళితులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, డెంకాడ మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌ రావు, నాయకులు పతివాడ అప్పలనారాయణ, నెల్లిమర్ల, పూసపాటి రేగ మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్‌, మహంతి శంకర్రావు, అధికార ప్రతినిధి గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, చీకటి సుహాసిని, కనిగిరి శ్రీనివాసరావు, పొడుగు కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
గరివిడి: రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. అత్యంత వెనుకబడిన, వివక్షకు గురవుతున్న దళిత సోదరులకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ముందుకు తీసుకు వెళ్లాల్సింది పోయి జగన్‌ పాలనలో వారి మీద అధిక స్థాయిలో దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులను ఖండిస్తూ ఆదివారం చీపురుపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయన్నారు. మాస్క్‌ అడిగినందుకు ఒక వైద్యుడిని చంపేశారని, మాస్క్‌ లేదని మరో యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు, దళిత నాయకులు పెందుర్తి సింహాచలం, రేగిడి లక్ష్మణరావు, పైడిరామ్‌, శ్రీను, శివ, రామారావు, అప్పలరాజు టిడిపి నాయకులు పైల బలరాం, సారేపాక సురేష్‌ బాబు, ముల్లు రమణ తదితరులు పాల్గొన్నారు.