Sep 30,2020 21:12

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న డప్పు కళాకారులు


ప్రజాశక్తి - కార్వేటినగరం : దళితులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ళ శ్రీనివాసులు అన్నారు. బుధవారం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళితులు యాత్ర సందర్భంగా డప్పు కళాకారులు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడి జరిగిన వెంటనే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి శిక్షించాలన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం హక్కులను కల్పించిన విధంగా దళితులకు న్యాయం జరగాలని అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ తహశీల్దార్‌ ఆధ్వర్యంలో జరపాలని కోరారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీలు ఎదుర్కొంటున్న భూ సమస్యను తొందరగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్వేటినగరం సంత గేటు నుంచి డప్పులతో గ్రామవీధుల్లో ర్యాలీగా వెళ్లి మండల తహశీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు సమస్య పరిష్కరించాలని వినతి అందించరు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మార్కొండయ్య, కళాకారులు, సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు.