ప్రజాశక్తి-సత్తెనపల్లి : దళితులపై దాడుల కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు అన్నారు. సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సిహెచ్.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పివి భవన్లో ఆదివారం జరిగింది. రవిబాబు మాట్లాడుతూ దళితుల ఓట్ల మీద ఉన్న ప్రేమ వారి రక్షణపై పాలకులకు లేదన్నారు. కేంద్రంలో మనువాద ఆర్‌ఎస్‌ఎస్ భావజాలతో నడిచే బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు తీవ్రంగా పెరిగాయని, అదే పద్ధతిలో రాష్ట్రంలోనూ దళితులకు, దళితుల భూములకు రక్షణ కరువైందని విమర్శించారు. దళితులకు రక్షణగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడం కోసం మోడీ ప్రభుత్వం యత్నిస్తుండగా దాన్ని ప్రతిఘటించి దళితులు సాధించుకున్న రక్షణ కల్పించే విధంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దళితుల మీద దాడులు చేసే వారికి భయం లేకుండా పోయిందని, అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత, గిరిజనులకు ఉన్న గృహ వినియోగ విద్యుత్ పాత బకాయిలను రద్దు చేయాలన్నారు. దళితులను చైతన్య పరచడానికి కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఐక్య ఉద్యమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలన్నారు. దేవాదాయ భూములను దళితులు సాగు చేసుకోవటానికి ఇవ్వాలని, కౌలు రైతుల్లో సగానిపైగా ఉన్నటువంటి దళితులకు గుర్తింపు కార్డులు, రైతు భరోసా, పంట నష్టపరిహారాలు తదితరాలను వర్తింపజేసేలా చట్టానికి సవరణలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు ఎం.విల్సన్, ఎం.ఆంజనేయులు, ఎం.క్రీస్తురాజు, బి.రామారావు, వి.పద్మ, సుమ, ఇనుముక్కల, ఏసు కుమార్, బి.చిన్న వెంకటస్వామి, కె.ధర్మరాజు పాల్గొన్నారు.










