
సోమందేపల్లి : మండల పరిధిలోని చాకర్లపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దళితులపై అదే గ్రామానికి చెందిన పెత్తందారులు కులం పేరుతో దూషించి దాడి చేయడం హేయమైన చర్యని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చాకర్లపల్లి గ్రామంలో దళితులను పరామర్శించి, దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం చాకర్లపల్లి గ్రామంలోని సుజాతమ్మ, రామాంజినమ్మ ఇళ్లలోకి దౌర్జన్యంగా ప్రవేశించి పెత్తందారులు దాడి చేశారన్నారు. దాడి విషయాన్ని బాధితులు పోలీసులకు తెలిపినా ఇంత వరకు నిందితులను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు నిత్యావసర సరుకులు ఇవ్వకుండా, కూలి పనులకు పిలవకుండా సాంఘిక బహిష్కరణ చేయాలన్న ఉద్ధేశంతో పెత్తందారులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు దీనిపై వెంటనే స్పందించాలన్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణం నిందితులను అరెస్టు చేసి, దళితులకు రక్షణగా నిలవాలని కోరారు. లేకుంటే కలిసొచ్చే దళిత, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. చాకర్లపల్లి దళితుల ఘటనపై ఈనెల 27న చర్చావేదిక నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, మండల కార్యదర్శి వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, రంగప్ప, కొండా వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బెస్త కిష్టప్ప, చేనేత కార్మిక సంఘం మండల నాయకులు కుమ్మరి కిష్టప్ప, సిపిఎం మండల నాయకులు శ్రీకాంత్, కెవిపిఎస్ మండల నాయకులు గోవిందప్ప, కేతగాని చెరువు రామంజి పాల్గొన్నారు.