
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పుష్పరాజ్
ప్రజాశక్తి - ఉండి
దళితులపై దాడి చేసి చర్చి అద్దాలు పగలగొట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు. మండలంలోని వాండ్రం గ్రామంలో దళితులను పుష్పరాజు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కొంతమంది అగ్రవర్ణాల వారు దళితులపై దాడి చేసి మారణాయుధాలతో బెదిరించిన వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లోకి వెళ్తున్న ఎస్‌సి, ఎస్‌టి నాయకులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. గ్రామస్తులతో కలిసి వారిపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంధి జయరాజు, జిల్లా అధ్యక్షులు నేతల సువర్ణరాజు, జిల్లా కార్యదర్శి చిల్లి రాజ్‌కుమార్, ఉండి నియోజకవర్గ అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, ఉండి మండల అధ్యక్షులు తోర్లపాటి భాగ్యరాజ్, నియోజవర్గ కార్యదర్శి నవమణి రాజు, రాజశేఖర్, సాయి జగన్నాథ్, భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి నేతల సాల్మన్ రాజు, జెఎసి సభ్యులు పాల్గొన్నారు.
పొన్నమండ బాలకష్ణను అడ్డుకున్న పోలీసులు
మండలంలోని వాండ్రం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన దాడుల్లో గాయపడిన దళితుల కుటుంబాలను పరామర్శించేందుకు శనివారం వాండ్రం వెళ్తున్న ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మానిటరింగ్ సభ్యులు పొన్నమండ బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. వేరే గ్రామస్తులు వాండ్రం గ్రామంలోకి వెళ్లేందుకు ఎవరికి అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో పొన్నమండ బాలకృష్ణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి ఎస్‌టి కమిషన్ మానిటరింగ్ సభ్యునిగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లే అర్హత తనకుందని, ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. తనని అడ్డుకున్న పోలీసులపై ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
వాండ్రం ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
భీమవరం : ఉండి మండలంలోని వాండ్రం గ్రామం పెద్ద పేటపై అగ్రవర్ణాలకు చెందినవారు దాడి చేయటం దారుణమని, నిందితులను శిక్షించాలని ఎస్‌సి ఎస్‌టి మోనిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ డిమాండ్ చేశారు. వాండ్రం గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన బాధిత దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. అనంతరం భీమవరం ఆర్‌డిఒ దాసిరాజు, భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్‌లకు స్థానికంగా నెలకొన్న సమస్యలను విన్నవించారు. దాడికి పాల్పడిన నిందితులపై ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ, పిఒఎస్ యాక్ట్ 302 కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.