Oct 13,2023 22:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సమాజంలో దళితులపై చిన్నచూపు ఇంకా తగ్గలేదు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం అమలులో నిర్లక్ష్యం కారణంగా దళితులపై నేటికీ వివక్ష కొనసాగుతూ వస్తోంది. తరచూ దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగంగా హత్యలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
దళితుని కొట్టి చంపి డోర్‌ డెలివరీ...
వైసిపి ఎంఎల్‌సి అనంత బాబు తన కారు డ్రైవరైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని కారులో డోర్‌ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. జిల్లా కేంద్రం కాకినాడ నడిబొడ్డున జరిగిన ఈ దారుణంతో అందరూ ఉలిక్కి పడ్డారు. దళితులపై వివక్ష కొనసాగుతోందనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంత బాబుకు అధికార పార్టీ నేతల అండదండలు దండిగా ఉండడంతో నేరస్తునిగా ఉన్నా ఆయన యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ నెల 12న సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సిఎం ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆయన వెంట అనంత బాబు కూడా ఉన్నారు. బస్సులో సిఎంతోనే తిరిగారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని పైకి చెప్పుకొస్తున్నా ఒక నేరస్తుని వెనకేసుకుని వస్తున్న ప్రభుత్వ పెద్దల తీరు విమర్శలకు తావిస్తోంది. దళిత యువకుని హత్య చేసి నేరారోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు వంటి వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోతే దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పునరావతమయ్యే అవకాశం ఉంటుంది.
దారుణంగా దాడి చేసి కొట్టి....
ఈ ఏడాది మార్చి 21న తొండంగి మండలం శృంగవక్షంలో అర్ధరాత్రి నూకాలమ్మ జాతర సందర్భంగా కొందరు అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులు దళిత యువకులపై దారుణంగా దాడి చేశారు. ఉద్దేశపూర్వకంగా చితక బాదడంతో తీవ్ర గాయలైన యువకుడు నడిపల్లి రాము మృతి చెందాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. దళితపేటలోని ఇళ్ల పైకి వచ్చి కులం పేరుతో దూషించడమే కాక అత్యంత కిరాతకంగా గొంతు కోసి తీవ్రంగా గాయపరిచిన ఈ సంఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులను తప్పించే ప్రయత్నం చేశారు. దాడికి తెగబడిన 16 మందిలో నలుగురు కీలకమైన వారిని కావాలనే పక్కన పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, పార్టీ రాష్ట్ర నాయకుడు ఎవి.నాగేశ్వరరావు, జిల్లా నాయకత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డారు. వారికి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్షపడే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
మూకుమ్మడిగా దళిత పేటపై దాడి
గతేడాది ఏప్రిల్‌లో పిఠాపురం మండలం మల్లంలో వందల మంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దళిత పేటపై అర్ధరాత్రి సమయంలో మూకుమ్మడిగా దాడికి దిగారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన కడితి కృష్ణపైనా దాడి చేసి అతని మర్మంగాలను బ్లేడుతో కోసేసారు. రండా రాంబాబు, అతని భార్య వరలక్ష్మి, కుమార్తె పావనిపైనా దాడికి తెగబడ్డారు. మరో ఇద్దరు దళిత మహిళలనూ విచక్షణారహితంగా కొట్టారు. ఇదంతా అక్కడే ఉన్న కొంతమంది పోలీసులు సమక్షంలోనే జరిగినా ఆపలేకపోయారు. ఏప్రిల్‌ 14న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వేడుకల ఫోటోలను కొందరు దళిత యువకులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాటిపై గ్రామ అగ్రకుల యువకుడు ఒకడు అంబేద్కర్‌ను కించపరుస్తూ కామెంట్‌ చేశాడు. ఈ విషయంపై స్థానిక దళిత యువకులు గ్రామ పెద్దలకు పిర్యాదు చేయగా క్షమాపణ చెప్పించి అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేయించారు. ఆరోజు ఆగ్రహించిన అగ్రకులస్తులు జాతరల్లో మీ సంగతి చెబుతామని హెచ్చరిక చేశారు. ప్రమాదాన్ని పసిగట్టని నలుగురు దళిత యువకులు 29న ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లారు. అదను కోసం ఎదురుచూస్తున్న వారు బ్లేడ్‌తో దాడులు చేశారు.
అనేక ఘటనలు
ప్రత్తిపాడు మండలం వాకపల్లిలో గ్రామ దేవత జాతరలో అగ్రవర్ణాలు దళితులైన నెలపర్తి శ్రీనివాసరావు, సికోలు అప్పన్న మరి కొంతమందిపై దాడి చేశారు. రాజకీయ పలుకుబడితో ఇరూ వర్గాలపై కౌంటర్‌ కేసులు కట్టడంతో 8 మంది దళితులను 2 నెలల పాటు జైల్లో పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నందుకు దళిత యువకునికి శిరోమండనం చేశారు. గోకవరం మండలం తిరుమలాయపాలెం అగ్రకుల పెత్తందారులు, పోలీసులు కలిసి దాడి చేయడంతో దళిత మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపుపై ఈ వివాదం జరగ్గా అగ్రవర్ణాలు ఒక్కటై నిందితులపై చర్యలు లేకుండా పోయాయి. దాడి చేసిన పోలీసులపైనా చర్యలు శూన్యం. ఇలా అనేక సందర్భాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.