ప్రజాశక్తి-వేపగుంట : దళితులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఎపిఇపిడిసిఎల్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు సుబ్బన్న మాట్లాడుతూ, 95వ వార్డు పరిధి కృష్ణరాయపురం దరి శ్రామికనగర్లో సుమారు 50 పారిశుధ్య కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. దళితులకు ఉచిత విద్యుత్ అమలులో ఉండటంతో వారు బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు ఒక్కసారి రూ.10 వేలు కట్టాలని బిల్లులు పంపించారని, కొంతమంది విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సహాయ ఇంజినీర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసి సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, సిఐటియు నాయకులు అప్పలనాయుడు, అప్పారావు, కొండ, బాల, లక్ష్మి, చిరంజీవి కాలనీవాసులు పాల్గొన్నారు.










